Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ ఫ్రీ హైదరాబాద్ కేసీఆర్ సంక‌ల్పం:ప‌ద్మారావు

By:  Tupaki Desk   |   22 July 2017 5:43 PM GMT
డ్ర‌గ్స్ ఫ్రీ హైదరాబాద్ కేసీఆర్ సంక‌ల్పం:ప‌ద్మారావు
X
హైద‌రాబాద్ లో సంచలనం సృష్టించిన డ్ర‌గ్స్ రాకెట్ లో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టబోమని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు స్పష్టంచేశారు. ఈ రాకెట్ తో ప్రమేయం ఉన్న వారిని వ‌దిలిపెట్ట‌మ‌న్నారు. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల పైన చర్యలు తప్పవన్నారు. డ్ర‌గ్స్ రాకెట్ ను సీఎం కేసీఆర్ చాలా సీరియ‌స్ గా తీసుకున్నార‌ని ప‌ద్మారావు తెలిపారు. శ‌నివారం ఆయ‌న‌ మీడియా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌ను డ్ర‌గ్స్‌ఫ్రీ సిటీగా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు. ఆ ప్ర‌కారం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్టుచేశామ‌ని తెలిపారు. నైజీరియన్లు ఎక్కువగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో 11 బార్లు, 26 పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్టు ఆయన వివరించారు. కొంత‌మంది స్కూల్ పిల్ల‌లు డ్ర‌గ్స్ సేవించ‌డం బాధాక‌ర‌మ‌ని, పిల్లలపై త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని సూచించారు. విద్యార్థులు డ్ర‌గ్స్ కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ కు బెదిరింపు కాల్స్‌ వస్తోన్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అకున్‌ చాలా మొండి అని, ఎవరికీ భయపడరని అన్నారు. డ్ర‌గ్స్ కేసును సీఎం కేసీఆర్ చాలా సీరియ‌స్ గా తీసుకున్నార‌ని, కేసును నీరుగార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని, ఆయన పరిస్థితేంటో అందరికీ తెలుసని పద్మారావు అన్నారు.

కాగా, అకున్‌ సబర్వాల్‌ కు బెదిరింపు కాల్స్ పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శ‌ర్మ స్పందించారు. ఆ కాల్స్ వ్య‌వ‌హారంలో విచార‌ణ జ‌రుగుతోందని, కాల్స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో సంబంధిత‌ అధికారులు ప‌రిశీలిస్తున్నారని అన్నారు. అవ‌స‌ర‌మైతే అకున్ స‌బ‌ర్వాల్‌కు భ‌ద్ర‌త పెంచుతామ‌ని తెలిపారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే ముఠాలే ఈ ఫోన్ కాల్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.