Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీని ఇచ్చేయండి : పెద్దిరెడ్డి !

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:30 PM GMT
ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీని ఇచ్చేయండి : పెద్దిరెడ్డి !
X
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా ప్రభంజనం కొనసాగింది. గత కొన్ని రోజులుగా ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అయినట్టుగా వైసీపీకి జనం నీరాజనం పడుతున్నారు. ఈ విజయం తో అధికార పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. అయితే, ఎన్నికల్లో కీలక అంశం కుప్పం. చంద్రబాబు నాయుడు, తనకు అడ్డాగా మార్చుకుని.. 40 ఏళ్ల పాటు తిరుగులేని నేతగా ఎదిగిని నియోజకవర్గాన్ని, వైసీపీ ఆక్రమించేసింది. అసలు ఇంత కాలం ఎన్నికలే లేకుండా ఏకగ్రీవంగా నెట్టుకొస్తున్న కుప్పం, మున్సిపాలిటిలో పోటీ చేయడం కాదు. ఏకం ఆ మున్సిపాలిటీనే వైసీపీ సొంతం చేసుకుంది.

ఈ విజయం క్రెడిట్ అంతా కచ్చితంగా మంత్రి పెద్ది రెడ్డిదే. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి, స్వయంగా పెద్దిరెడ్డిని పిలిపించి మరీ అభినందించారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర మంతా ఒక ఎత్తైతే.. కుప్పం ఒక ఎత్తు, అధికార పార్టీగా అన్ని చోట్ల ఈజీగా గెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చంద్రబాబు కోటను బద్దల కొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఆ పనిని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు అధినేత జగన్. ప్రమాదం పొంచి ఉందని ముందే ఊహించిన చంద్రబాబు స్వయంగా కుప్పం వెళ్లి.. ప్రజలను కార్యకర్తలు, నేతలను అందరినీ కలిసి.. పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా, పెద్దిరెడ్డి వ్యూహాల ముందు ఆయన అనుభవం నిలబడలేకపోయింది.

ఈ విజయంతో మంత్రి పెద్ది రెడ్డి చంద్రబాబు, లోకేష్ పై పంచ్ లు వేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఉందన్నారు. దాని ఫలితంగానే ప్రతిపక్ష నేత, 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధ్యమైంది అన్నారు. కుప్పంలో పంచాయతీ, పరిషత్, మున్సిపోల్స్‌లోనూ ప్రజలు వైసిపికే పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇంతలా ప్రజలు ఛీ కొట్టినా ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని అనుకోవడం లేదన్నారు.

ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కున్నారని.. చివరికి ఆ పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగించాలని పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. వరుస ఓటమిలతో కుంగిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ తన ఆరోగ్యం కాపాడుకోవడం మంచిదన్నారు. నా మీద చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చాలా దుర్భాషలాడారని గుర్తుచేసుకున్న ఆయన.. నేను 17వ తేదీన మాట్లాడతానని ఆ రోజే చెప్పానన్నారు. మరోవైపు, చంద్రబాబు పుంగనూరు వచ్చి పోటీ చేస్తానంటే నేను ఆహ్వానిస్తానన్నారు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.