Begin typing your search above and press return to search.

కెలికి కంపు చేసుకోవటంలో మరీ ఇంతనా పెద్దిరెడ్డి!

By:  Tupaki Desk   |   11 May 2022 12:30 PM GMT
కెలికి కంపు చేసుకోవటంలో మరీ ఇంతనా పెద్దిరెడ్డి!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి ఒక్కో శాఖను అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఎంత రాజకీయమైనప్పటికి ఎదుటి వారి శాఖలో వేలు పెట్టి తిప్పటానికి మించిన పెద్ద తప్పు ఉండదు. ఎవరి శాఖ మీద వారికి ఉన్నంత పట్టు పక్కనోడి శాఖ మీద ఉండదు. అలాంటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ.. ఏపీ విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కదిలించుకొని మరీ కంపు చేసుకుంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డికి ఏ మాత్రం అవగాహన ఉందో తెలీదు. ఒక వేళ తెలిసినా.. సంబంధిత శాఖా మంత్రి మాట్లాడితే బాగుంటుంది. ఒక వేళ సదరు మంత్రి జూనియర్ అయితే సీనియర్ గా పెద్దిరెడ్డి లాంటివాళ్లు మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ.. అక్కడ ఉంది సీనియర్ నేత బొత్స సత్యానారాయణ. ఆయనకు ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి.. ఎలా డీల్ చేయాలన్న దాని పై ఆయనకు అవగాహన ఎక్కువే ఉంటుంది.

అయితే.. మాజీ మంత్రి నారాయణ లాంటి ప్రముఖుడి అరెస్టు మీద మీడియా అడిగినప్పుడు మాట్లాడటం తప్పేం కాదు. కానీ.. తనకు సంబంధం లేని శాఖ గురించి మాట్లాడి.. తెలిసి తెలియని వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యే కంటే మౌనంగా ఉంటే మంచిది. ఈ విషయాన్ని మరిచిపోయిన పెద్దిరెడ్డి.. తనకు తోచినట్లుగా మాట్లాడి మీడియా దగ్గర తెగ ఇబ్బంది పడటమేకాదు.. ఆయనగారి డొల్లతనం నవ్వులపాలయ్యేలా మారిందని చెప్పక తప్పదు.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఇష్యూలో ప్రభుత్వం ఇప్పటి వరకు 60 మందిని అరెస్టు చేసిందని.. పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి ఫోన్ల ను ట్యాప్ చేయటం తోనే నిజమైన బాధ్యుల్ని అరెస్టు చేసినట్లుగా పెద్దిరెడ్డి పేర్కొన్నారు. లీకేజీ ఎక్కువగా నారాయణ సంస్థల్లోనే జరిగిందన్నారు. పెద్దిరెడ్డి మాటలకు మీడియా ప్రతినిధులు.. ‘మరి మంత్రి బొత్స సత్యానారాయణ ఎక్కడా ప్రశ్నాపత్రాలు లీకు కాలేదని ప్రకటించారు కదా?’ అని ప్రశ్నిస్తే.. పెద్దరెడ్డి చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

‘అదే మంత్రి అరవై మందిని అరెస్టు చేయించారుగా? విచారణ పూర్తి అయ్యే వరకు ఎవరైనా విలేకరుల వద్దకు వచ్చి పేపర్ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా?’ అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి వారి లాజిక్ నిజమే అనుకుందాం.. అలాంటప్పుడు పేపర్ లీక్ కాలేదని కూడా చెప్పరు కదా? ఎక్కడైనా లీకైన పేపరు గురించి లీకైందని.. నిందితుల్ని పట్టుకుంటామని.. కఠినంగా శిక్షిస్తామని చెబుతారే కానీ.. లీకు కాలేదని చెప్పి అరెస్టు చేయరు కదా? పేపర్ లీక్ కాలేదని మీ విద్యామంత్రే కదా చెప్పిందంటే.. తాను విద్యామంత్రిని కాదని చెప్పుకొచ్చారు. మరి.. విద్యా మంత్రి గారు కానప్పుడు.. తనకు సంబంధం లేని శాఖ గురించి పెద్దిరెడ్డిగారు మాట్లాడం ఎందుకో? ఇలాంటి వాటినే కదా కెలికి కంపు చేసుకోవటం అంటారు?