Begin typing your search above and press return to search.

టికెట్ ధరల అంశం: సీఎం జగన్ తో మంత్రి నాని భేటీ..!

By:  Tupaki Desk   |   8 Feb 2022 1:04 PM GMT
టికెట్ ధరల అంశం: సీఎం జగన్ తో మంత్రి నాని భేటీ..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశం మీద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుతం ఏర్పాటు చేసిన కమిటీ.. దీనిపై పలు దఫాలు చర్చలు జరిపింది. అయితే టికెట్ల వ్యవహారంపై దాదాపు నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనం గురించి.. సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలు మరియు థియేటర్ల యజమానుల సమస్యలపై చర్చించారని సమాచారం.

గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలను ఏ మేరకు పెంచాలన్న విషయంపైనా మరియు సామాన్య ప్రజానీకానికి సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్‌ రేట్లు ఎంత నిర్ణయించాలనే దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారని తెలుస్తోంది. ఈ అంశాలను సీఎం జగన్‌ కు మంత్రి పేర్ని నాని వివరించారు. అలానే థియేటర్‌లలో మౌలిక సదుపాయాలు మరియు క్యాంటీన్ల నిర్వహణ పైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

ఈ క్రమంలో ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించేందుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇప్పటికే వీరికి పిబ్రవరి 10వ తేదీన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఈ భేటీలో ముఖ్యంగా సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపైనా ఐదో షోకు అనుమతి ఇవ్వడం గురించి చర్చించే అవకాశం ఉంది. అలానే నిర్మాతలు థియేటర్‌ యజమానులు పంపిణీదారులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా.. సినిమా రంగానికి ప్రభుత్వపరంగా అందాల్సిన ప్రోత్సహకాలపైనా చర్చించనున్నారు.

గురువారం జరగబోయే సీఎం జగన్ - సినీ ప్రముఖుల భేటీలో ప్రభుత్వ నివేదికపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే గతంలో ముఖ్యమంత్రితో చిరంజీవి ఒక్కరే భేటీ అవ్వగా.. ఈసారి నాగార్జున - మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ వంటి స్టార్స్ మరియు నిర్మాతలు డీవీవీ దానయ్య - నిరంజన్ రెడ్డి - యూవీ వంశీతో సహా మరికొంత మంది వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఏదేమైనా ఏపీలో సినిమా టికెట్ రేట్ల సమస్య ఓ కొలిక్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు హీరోలు, నిర్మాతలు అసహనం వ్యక్తం చేసారు. మరికొందరు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల మీద అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం.. సినీ ప్రముఖుల అభ్యర్థనలు దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.