Begin typing your search above and press return to search.

అక్కడ గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ

By:  Tupaki Desk   |   3 April 2017 2:50 PM GMT
అక్కడ గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ
X
ఇండియాలో రాజకీయా సెంటిమెంట్లు విచిత్రంగా ఉంటాయి. కాకతాళీయమో ఏమో కానీ కొన్ని సెంటిమెంట్లు కచ్చితంగా జరుగుతుంటాయి. తాజాగా ఏపీ మంత్రివర్గ విస్తరణలో అలాంటి సెంటిమెంటు ఫలితం ఒకటి కనిపించిందంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు కూడా సెంటిమెంటు బలం వల్ల మంత్రి పదవి వరించిందని.. నిజానికి ఆయన మొదటి నుంచి పోటీదారుల్లో లేరని.. అయినా పదవి దక్కిందని అంటున్నారు.

నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1962లో ఏర్పడ్డ ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఓ సెంటిమెంట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ నక్కా ఆనందబాబుకు కలిసొచ్చింది.

గతంలో ఇక్కడ గెలుపొందిన వారిలో ఆరుగురు మంత్రి పదవులను అలంకరించారు. వారిలో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

* 19555, 62లో గెలిచిన కాంగ్రెస్ నేత కల్లూరి చంద్రమౌళి మంత్రిగా పనిచేశారు.
* ఆపై 1967, 1972లో ఇండిపెండెంట్ గా, 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన యడ్లపాటి వెంకట్రావు కూడా మంత్రిగా పనిచేశారు.
* 1983లో నాదెండ్ల భాస్కరరావు విజయం సాధించి సీఎం అయ్యారు.
* 1989లో ఆలపాటి ధర్మారావు గెలిచి మంత్రి అయ్యారు.
* 1999లోనూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచి మంత్రిగా పనిచేశారు.
* 2009లో, ఆపై 2014లో నక్కా ఆనందబాబు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్న వేళ ఆయన చూపిన ఓర్పు, ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత కుల సమీకరణాలు కలసిరావడంతో, వేమూరు సెంటిమెంట్ ఆయనపై పనిచేసింది.
* కాగా 2004లో గెలిచిన సతీశ్ పాల్ రాజ్, 1985లో విజయం సాధించిన కొడాలి వీరయ్యలు మాత్రమే మంత్రులు కాలేదు.