Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి...?

By:  Tupaki Desk   |   31 March 2022 3:30 PM GMT
ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి...?
X
మంత్రి కావాలీ అంటే ముందు ఎమ్మెల్యే కావాలి. అయితే తమకు కావాల్సిన వారిని ముందు మంత్రిగా చేసి ఆ మీదట ఆరు నెలల కాలంలో ఏదో ఒక చట్ట సభకు సభ్యులుగా ఎంపిక చేయించుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఆ విధంగా ఇపుడు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవిని ఆమె అందుకోబోతున్నారు. ఆమె ఎవరో కాదు, దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సతీమణి శ్రీకీర్తి.

ఈ నెల 11న జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆమె చేత మంత్రిగా ప్రమాణం చేయించేందుకు వైసీపీ హై కమాండ్ సిద్ధంగా ఉందని అంటున్నారు. మేకపాటి కుటుంబానికి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ ఈ మధ్యన జరిగిన ఆయన సంస్మ‌రణ సభలో హామీ ఇచ్చిన నేపధ్యం ఉంది.

ఇక మేకపాటి గౌతం రెడ్డి జగన్ కి చిన్ననాటి స్నేహితుడు. దాంతో ఆయన ఆ ఫ్యామిలీ నుంచే వారసులు రావాలని బలంగా కోరుకుంటున్నారుట. మరో వైపు చూస్తే ఆత్మ‌కూరు లో జరిగే ఉప ఎన్నికలో కూడా శ్రీ కీర్తిని నిలబెట్టాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఉప ఎన్నిక అన్నది ఆరు నెలల వ్యవధిలో జరగనుంది. దాంతో ఈలోగా ఆమెను మంత్రిని చేయాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఉప ఎన్నిక అంటూ జరిగితే ఏకగ్రీవం కానుందని అంటున్నారు. గౌతం సతీమణిని నిలబెడితే టీడీపీ పోటీ పెట్టదు, ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు క్యాండిడేట్లు పెడితే ఎన్నిక జరుగుతుంది. అది కూడా నామమాత్రం అవుతుంది.

మొత్తానికి ఈ ఉప ఎన్నిక మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యం ఇలా ఉంటే ముందు ఆమెను మంత్రిగా చేసి మేకపాటి ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. మరి నెల్లూరు సామాజిక సమీకరణలు చూస్తే మరో రెడ్డికి మంత్రి పదవికి అవకాశం ఉంటుందా అన్నది చూడాలి.

అయితే ఈ సమీకరణలకు అతీతంగా ఆమె ఎంపిక ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి అయితే శ్రీకీర్తి మంత్రిగా ప్రమాణం చేస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. చూడాలి మరి.