Begin typing your search above and press return to search.

అడిగిందేమిటి..? చెప్పేదేంటి జవదేవకర్?

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:35 PM GMT
అడిగిందేమిటి..? చెప్పేదేంటి జవదేవకర్?
X
రాజకీయ నేతలు ముచ్చటగా మూడు రకాలు. ఒకరేమో.. అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేస్తారు. వీరితో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పదిస్తే చెప్పేస్తారు. లేదంటే నో అనేస్తారు. ఇక.. రెండో రకం విషయానికి వస్తే వీరు ఏ ప్రశ్న అడిగినా.. ఆ ప్రశ్నకు సంబంధం ఉందా? లేదా? అన్నది చూసుకోకుండా తాము చెప్పాల్సింది చెప్పుకుపోతారు. వీరిని ప్రశ్నలు ఎన్ని అడిగినా.. సమాదానాలు వాటికి సంబంధం లేనివే ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వారిని ప్రశ్నలేం అడిగినా వాటికి సమాధానాలు చిరాకు పడకుండా చెప్పేస్తుంటారు. అదే సమయంలో.. అడిగే ప్రశ్నకు.. చెప్పే సమాధానికి మధ్య లింకు ఏమైనా ఉందా? అని అడిగే అవకాశమే ఇవ్వరు.

ఇక మూడో రకం గురించి చెప్పాలి. వీరు నోరు తెరిస్తే సంచలనం అన్నట్లుగా ఉంటుంది. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం తిన్నగా ఉండదు. అడిగే ప్రశ్న ఏదైనా వారికి ఇబ్బంది కలిగించేదిగా ఉంటే.. వారి టోన్ మారుతుంది. తర్వాత సమాధానం చెప్పే స్టైల్ మారిపోతుంది. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

ఇలా మూడు రకాల్లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రెండో రకానికి చెందిన వారు. టెంపర్ మెంట్ ఎప్పుడూ మిస్ కాకుండా ఉండే ఆయన.. కూల్ గా బదులిచ్చేలా వ్యవహరిస్తుంటారు. అడిగిన ప్రశ్నకు.. అడగని ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్లు కనిపిస్తారు కానీ.. సూటిగా అడిగే ఏ ప్రశ్నకు అంతే సూటిగా సమాధానం చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు.

కృష్ణా పుష్కరాల సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ ఫుష్కర స్నానానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర వైఖరి ఏమిటంటూ అడిగిన ప్రశ్నకు వారి నుంచి సమాధానం లేదు. ప్రత్యేక హోదా గురించి అడిగితే.. ఆయన సమాధానం అందుకు ఏ మాత్రం సంబంధం లేకుండా చెప్పుకుంటూ పోయిన వైనం చూస్తే.. ఇందాక చెప్పిన రెండో నేత తీరు చప్పున గుర్తుకు రాక మానదు. ప్రత్యేక హోదా గురించి వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు సాధిస్తుందన్న నమ్మకం ఉందని.. పుష్కర సంకల్పంగా నాణ్యమైన విద్య అందరికి అందాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఏపీని ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందంటూ బడాయి మాటలు చెప్పిన ఆయన.. ఏపీని ఆదుకోవటానికి వీలుగా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పకుండా మీడియాతో మాట్లాడేసి వెళ్లిపోయారు. హోదా గురించి ఏ మాత్రం రియాక్ట్ కాకూడదని ఫిక్స్ అయిన జవదేకర్ లాంటి వారి చేత నోరు విప్పించలేం కదా?