Begin typing your search above and press return to search.

ఆపుకోలేక.. రోడ్డు మీద పోసేసిన మంత్రి

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:13 AM GMT
ఆపుకోలేక.. రోడ్డు మీద పోసేసిన మంత్రి
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాన‌స పుత్రిక అయిన స్వ‌చ్ఛ‌ భార‌త్‌ పై సెటైర్ల మీద సెటైర్లు ప‌డేందుకు ఆ పార్టీ నేత‌లే కొంద‌రు కార‌ణ‌మవుతున్నారు. దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని ముందుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ అందుకు విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో నీటి సంరక్షణ శాఖ మంత్రి రామ్ షిండే వివాదాస్ప‌ద రీతిలో వ్య‌వ‌హ‌రించారు. బహిరంగ మూత్ర విసర్జన చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మ‌హారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామ్ షిండే సోలాపూర్ - బర్షి రహదారిపై మూత్ర విసర్జన చేశారు. రోడ్డు పక్కనే మంత్రి మూత్ర విసర్జన చేస్తుండ‌టాన్ని వీడియో తీసి కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు మంత్రి రామ్ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో దీనిపై మీడియా మంత్రిని సంప్రదించగా.. గత నెల రోజుల నుంచి జల్‌ యుక్త శివార్ స్కీమ్‌ పై ప్రచారం కల్పించేందుకు తీరిక లేకుండా తిరుగుతున్నానని తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాయనని చెప్పారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. రహదారిపై ఎక్కడా మూత్రశాల కనిపించకపోవడంతో.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రోడ్డుపై పోయాల్సి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, మంత్రి వివరణపై విపక్షాలు మండిప‌డ్డాయి. ప్ర‌తిప‌క్ష‌ ఎన్సీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం పూర్తిస్థాయిలో విఫలమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తే.. ప్రజలు ఉల్లంఘించరా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రజలకు ఆదర్శంగా నిలిచినప్పుడే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం అవుతుందన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విఫలమైందనడానికి మంత్రి రామ్ షిండే చక్కటి ఉదాహరణ అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. కాగా,
రామ్ షిండే చేసిన పని విపక్షాలకు ఆయాచితంగా విమర్శనాయుధాలను సమకూర్చి పెట్టిందని బీజేపీ నేత‌లు స‌ణుక్కుంటున్నారు.