Begin typing your search above and press return to search.

బొత్స కుర్చీలో ఆయనేనట...?

By:  Tupaki Desk   |   2 April 2022 11:45 AM GMT
బొత్స  కుర్చీలో ఆయనేనట...?
X
విజయనగరం జిల్లాకు రాజకీయంగా రాజు ఎవరంటే బొత్స సత్యనారాయణ అని చెప్పాలి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. గత రెండున్నర దశాబ్దాల కాలంగా రాష్ట్ర నాయకుడిగా వెలుగుతున్నారు. బలమైన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్స ఉత్తరాంధ్రా జిల్లాలలో ఆ సామాజిక వర్గంలోనూ, బీసీల్లోనూ పలుకుబడి కలిగిన నాయకుడు.

బొత్స సత్యనారాయణకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అన్న చర్చ అయితే జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆయనను పార్టీ సేవలకు ఉపయోగించుకుంటారు అని అంటున్నా కూడా బొత్సని తప్పించాలి అంటే చాలానే చేయాలి అన్న మాట కూడా ఉంది. బొత్స రాజకీయ,సామాజిక బలాల దృష్ట్యా ఆయనని కనుక పక్కన పెడితే ఆయన కుటుంబం నుంచే మంత్రి పదవిని రీప్లేస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తొలిసారి గెలిచారు. మళ్లీ 2019 ఎన్నికల్లో రెండవసారి గెలిచి సత్తా చాటారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని ఇపుడు గట్టిగా వినిపిస్తున్న మాట. బొత్సను కాదంటే అప్పలనరసయ్యకే కుర్చీ ఇవ్వాలన్నదే కండిషన్ అంటున్నారు. ఆ విధంగా అయితేనే బొత్స తగ్గుతారు అని చెబుతున్నారు.

ఇక విజయనగరం జిల్లాలో ఇపుడు వినిపిస్తున్న మరో పేరు కోలగట్ల వీరభద్రస్వామిది. ఆయన వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత. బొత్సకు సమకాలీనుడు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. వైసీపీ పెట్టిన కొత్తల్లోనే పార్టీలో చేరిన నేత. జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడు. అయితే జిల్లాలోని సామాజిక సమీకరణలు కానీ రాజకీయ సమీకరణలు కానీ కోలగట్ల మంత్రి అయ్యేందుకు అనుకూలించడంలేదు అనే అంటున్నారు.

విజయనగరం జిల్లాల్తో పాటు ఉత్తరాంధ్రా అంతటా విస్తరించి ఉన్న తూర్పు కాపులకు ప్రాతినిధ్యం దక్కకపోతే ఎన్నికల వేళ అది రివర్స్ అవుతుందన్న ఆలోచన కూడా హై కమాండ్ లో ఉంది. ఇక విజయనగరం జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అంతా బొత్సకు దగ్గరవారే. వారిలో ఆయన బంధుగణమే ఎక్కువగా ఉంది. ఇక మంత్రిగా తన తమ్ముడిని కుర్చీలో కూర్చోబెట్టడానికి బొత్స స్కెచ్ వేస్తున్నారు అని అంటున్నారు.

ఆ విధంగా మంత్రిగా తాను లేకపోయినా తమ్ముడి పేరిట మరో మారు బొత్స హవా చాటుకునేందుకు వీలు చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ హైకమాండ్ కూడా బొత్స మాట కాదనే పరిస్థితి ఉండదని అంటున్నారు. బొత్స ఫ్యామిలీకి మంత్రి పదవికి కట్టబెడితే ఇటు కాపులు, అటు బీసీల కోటా ఒకే దెబ్బకు భర్తీ చేసినట్లు అవుతుంది, పైగా బొత్స అండదండలు కూడా పూర్తిగా పార్టీకి ఉంటాయి. దాంతో విస్తరణలో బొత్సను తప్పిస్తే అప్పలనరసయ్యే కొత్త మంత్రి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.