Begin typing your search above and press return to search.

మంత్రి సీదిరి సంచ‌ల‌న వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 Aug 2022 1:09 PM GMT
మంత్రి సీదిరి సంచ‌ల‌న వ్యాఖ్యలు
X
మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు నోరు జారాడు. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను ఉద్దేశిస్తూ నోరు జారాడు. శ్రీకాకుళం జిల్లా, ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం, వ‌జ్ర‌పుకొత్తూరు మండలం,గ‌రుడ‌భ‌ద్ర‌లో ఇవాళ ప‌ర్య‌టించిన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసి త‌మ‌కు రానున్న ఎన్నిక‌ల్లో ఓటేయ‌క‌పోతే పాపం త‌గులుతుంద‌న్నారు. ఇవే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టిదాకా చాలా డ‌బ్బులు అందుకున్నారు క‌నుక త‌మ‌కు ఓటేయాల్సిందేన‌న్న‌ది ఆయ‌న భావ‌న కావొచ్చు కానీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అన్న‌ది స‌మ‌ర్థంగా న‌డిచిన రోజు ఆ మాట అన్నా బాగుండేది.

ఇప్ప‌టికే సామాజిక పింఛ‌న్లు (త‌మ‌వారు కాకపోతే) త‌ప్పించిన దాఖ‌లాలే ఉన్నాయి. అంతేకాదు ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో అనేక సామాజిక స‌మ‌స్య‌లు ఉన్నాయి. క‌ల్తీ సారా రాజ్య‌మేలే ప్రాంతం ఇది. స్థానికంగా ఉపాధి లేక వ‌ల‌స‌లు పోతున్న ప్రాంతం అది. ఉద్దానం ప్రాంతం లో కిడ్నీ వ్యాధి బాధితుల‌తో నిరంత‌రం కొట్టుమిట్టాడే ప్రాంతం అది. ఇన్ని స‌మ‌స్య‌లు ఉంచుకుని ఓటేయ‌క‌పోతే పాపం అని ఎలా అంటారు అని విప‌క్షం ప్ర‌శ్నిస్తోంది. వాస్త‌వానికి మంత్రి ఉద్దేశం ఏ విధంగా ఉన్నా సంక్షేమ ఫ‌లాలు అందుకున్న వారే మ‌ళ్లీ ఓటేస్తారన్న గ్యారంటీ లేదు.

ఎందుకంటే ఇవ‌న్నీ మేం అడిగామా అన్న ప్ర‌శ్న కూడా రావొచ్చు. అంతేకాదు ఇవాళ ప‌లాస‌లో భూ క‌బ్జాలు  ఇంకా సూదికొండ త‌వ్వ‌కాలు సంబంధిత వివాదాలు, వీటితో పాటు రామ‌కృష్ణా పురం భూముల వివాదాలు ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. మంత్రికి స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం ఉంది.

అక్క‌డ కూడా గ్రూపు రాజ‌కీయాలే న‌డుస్తున్నాయి. వీలున్నంత వ‌ర‌కూ వాటిని ప‌రిష్క‌రించిన దాఖ‌లాలు అయితే లేవు. అదేవిధంగా మంత్రి చొర‌వ చూపి ప్ర‌జా సమ‌స్య‌లను  పరిష్క‌రిస్తే క్రేజ్ వస్తుంది కానీ ఆ మేర‌కు ఆయ‌న ప‌నిచేయ‌డం లేదు. అంతేకాదు ఆయ‌న‌కు ఇంటి పోరు కూడా ఉంది. ఇ వ‌న్నీ దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేయాల్సింది పోయి పాపం పుణ్యం లాంటి ప‌దాలెందుకు వాడ‌డం అని విప‌క్షాలంటున్నాయి.

వైసీపీకి ఓటేయ‌క‌పోతే పాపం చేసిన‌వాళ్లు, ఓటేసిన వాళ్లంతా పుణ్యం చేసిన‌వాళ్ల‌వుతారా ? అన్న ప్ర‌శ్న‌లూ వ‌స్తున్నాయి. వీలున్నంత వ‌ర‌కూ ఉద్దానం ప్రాంత స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా ఇక్క‌డ నిర్మిస్తున్న మల్టీ స్పెషాల్టీ ఆస్ప‌త్రి  పూర్తిపై దృష్టి సారిస్తే మంత్రిని ఈ ప్రాంత ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకోవ‌డం ఖాయం . అంతేకాదు తిత్లీ ప‌రిహారాల్లో ఉద్దానం ప్రాంతంలో స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇంకా ఇంకొంద‌రికి ఇప్ప‌టికీ అంద‌ని వైనం ఉంది. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కొంద‌రికే వీటిని అందించారు.ఇంకా అర్హుల జాబితాల కొందరి పేర్లు చేరాల్సి  ఉంది. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని వీలున్నంత వ‌ర‌కూ మంత్రి సామాజిక స‌మ‌స్య‌ల‌పై మాట్లాడితే, వాటి ప‌రిష్కారం కోసం తానేంచేస్తానో చెబితే బాగుంటుంద‌న్న‌ది విప‌క్ష వాద‌న.