Begin typing your search above and press return to search.

సోమిరెడ్డి రూలింగ్‌!..'ఓటుకు నోటు'లో బాబు పాత్ర లేదు!

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:24 PM GMT
సోమిరెడ్డి రూలింగ్‌!..ఓటుకు నోటులో బాబు పాత్ర లేదు!
X
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌... అటు కొత్త రాష్ట్రంగా తెలంగాణ - ఇటు మ‌రోమారు కొత్త రాష్ట్రంగా ఏపీ ప‌య‌నం ప్రారంభించిన వేళ‌... ఇరు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాదునే ప‌దేళ్ల పాటు కొన‌సాగించేందుకు అవకాశం క‌ల్పిస్తూ కేంద్రం రూపొందించిన విభ‌జ‌న చ‌ట్టం చాలా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో అప్ప‌టిదాకా ఉమ్మ‌డి రాష్ట్రానికి స‌చివాలయంగా కొన‌సాగిన సెక్ర‌టేరియ‌ట్‌ లో కొంత భాగాన్ని తీసేసుకున్న తెలంగాణ స‌ర్కారు... మ‌రికొంత భాగాన్ని ఏపీకి కేటాయించింది. ఇందులోనే టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ప్ర‌త్యేక కార్యాల‌యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల‌కు కోట్ల‌కొద్దీ నిధులు కూడా ఖ‌ర్చ‌య్యాయి. ఈ కార్యాల‌యాన్ని అట్ట‌హాసంగా ప్రారంభించిన చంద్ర‌బాబు... కొన్నాళ్ల‌కే ఆ కార్యాల‌యం నుంచి త‌న మ‌కాంను స‌డెన్‌ గా విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ చేసుకున్నారు. కోట్లాది నిధులు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఏర్పాటు చేసుకున్న కార్యాల‌యాన్ని వ‌దిలేసి క‌నీస సౌక‌ర్యాలు కూడా లేకుండా రూపొందిన విజ‌య‌వాడ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యాన్నే చంద్ర‌బాబు ఎందుకు ఎంచుకున్న‌ట్లు? ఈ ప్ర‌శ్న‌కు ఓటుకు నోటు కేసు కార‌ణ‌మ‌న్న స‌మాధానం వినిపిస్తోంది.

నిజ‌మే... ఓటుకు నోటు కేసు న‌మోదు కానంత‌వ‌ర‌కు హైద‌రాబాదు నుంచే ఏపీ పాల‌న‌ను సాగించిన చంద్ర‌బాబు.. ఆ కేసు దెబ్బ‌కు ఒక్క‌సారిగా హైద‌రాబాదును వ‌దిలేసి విజ‌య‌వాడ బాట ప‌ట్టార‌న్న వాద‌నలో ఏమాత్రం అస‌త్యం లేద‌న్న వాద‌న కూడా వినిపించిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఓటుకు నోటు కేసులో ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ స‌న్ ఓటును కొనుగోలు చేసేందుకు టీడీపీ య‌త్నించింది. ఈ క్ర‌మంలో నాడు తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డి రూ.50 ల‌క్ష‌ల క‌రెన్సీతో స్టీఫెన్ స‌న్ ఇంటికి వెళ్ల‌గా... తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకున్నారు. అంత‌కుముందు స్టీఫెన్ స‌న్ ఇంటిలో నుంచే చంద్ర‌బాబుకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి... స‌ద‌రు ఫోన్ ను స్టీఫెన్ స‌న్‌ కు ఇచ్చి చంద్ర‌బాబుతో మాట క‌లిపించారు. ఈ మొత్తం వాయిస్ కాల్ ను కూడా తెలంగాణ ఏసీబీ రికార్డు చేసేసింది. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి ఓ నెల పాటు జైల్లో ఉండ‌టం - తెలంగాణ ఏసీబీ అధికారులు చార్జీషీట్ ను కోర్టులో దాఖ‌లు చేయ‌డం జ‌రిగిపోయింది. ఆ చార్జీ షీట్‌ లో చంద్ర‌బాబు - స్టీఫెన్ స‌న్ ల మ‌ధ్య జ‌రిగిన ఫోన్ కాల్ వాయిస్ రికార్డుల‌ను కూడా జ‌త‌చేసింది. దీనిపై ఇంకా విచార‌ణ పూర్తి కాలేద‌నే చెప్పాలి.

మొత్తంగా ఈ కేసులో చంద్ర‌బాబు దాదాపుగా అడ్డంగా బుక్క‌య్యార‌ని - విచార‌ణ‌లో ఆయ‌న దోషిగా తేలుతారా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... స‌ద‌రు వాయిస్ కాల్ లోని వాయిస్ చంద్ర‌బాబుదేన‌ని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసినట్లుగానూ మొన్నామ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే ఈ కేసు విచార‌ణ కోర్టు ప‌రిధిలో ఉన్నందున దీనిపై ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. అయితే అందుకు విరుద్ధంగా నేటి మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ కేబినెట్ లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు చంద్ర‌బాబుకు ఓటుకు నోటు కేసులో పాత్రే లేద‌ని కూడా ఆయ‌న తేల్చేశారు. ఓటుకు నోటు కేసులో వినపడే వాయిస్ చంద్రబాబుది కాదని సోమిరెడ్డి అన్నారు. ఇదే విష‌యాన్ని న్యాయ‌మూర్తు చెప్పార‌ని వ్యాఖ్యానించిన సోమిరెడ్ది... స‌ద‌రు వ్యాఖ్య‌కు భిన్న‌మైన మ‌రో వ్యాఖ్య‌ను కూడా చేశారు.

ఒకవేళ ఆ వాయిస్ చంద్రబాబుదే అయినా కూడా అందులో ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు లేవని హైకోర్టు జడ్జి చెప్పారని అన్నారు. నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఓటు వేయమని చెప్పడమే వినపడుతుంది తప్ప, ఫలానా పార్టీకి ఓటెయ్యమని చంద్ర‌బాబు చెప్పలేదని జడ్జి చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయినా కోర్టులో విచార‌ణ సాగుతున్న ఈ కేసుకు సంబంధించి సోమిరెడ్డి ఈ స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా స‌ద‌రు వాయిస్ చంద్ర‌బాబుదా? కాదా? అన్న విష‌యాన్ని తేల్చేది సోమిరెడ్డా? లేదంటే కేసును విచారిస్తున్న న్యాయ‌మూర్తా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అస‌లు ఆ వాయిస్ చంద్ర‌బాబుది కాద‌ని చెప్పిన సోమిరెడ్డి... ఆ వెంట‌నే స‌ద‌రు వాయిస్ చంద్ర‌బాబుదే అయినా... చంద్ర‌బాబు త‌ప్పేమీ మాట్లాడ‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం చూస్తే... జ‌నాల‌ను సోమిరెడ్డి పెద్ద డైల‌మాలోనే ప‌డేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.