Begin typing your search above and press return to search.

సోమిరెడ్డి బ‌స్తీమే స‌వాల్ అంటున్నారే!

By:  Tupaki Desk   |   23 April 2019 2:16 PM GMT
సోమిరెడ్డి బ‌స్తీమే స‌వాల్ అంటున్నారే!
X
ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ సుదీర్ఘంగా ఉండ‌టంతో ఏపీలో ఎక్క‌డ‌లేని, ఎన్న‌డూలేని ఇబ్బందులు వ‌చ్చి ప‌డ్డాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాగానే... ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. అంతేకాకుండా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ఏపీలో అప్ప‌టిదాకా ఉన్న చంద్ర‌బాబు స‌ర్కారు... కోడ్ పుణ్య‌మా అని ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వంగా మారిపోయింది. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసే దాకా ఎలాంటి ఇబ్బంది రాలేదు గానీ... పోలింగ్ ముగిసిన త‌ర్వాతే సిస‌లైన ఇబ్బంది రంగంలోకి దిగేసింది. వ‌చ్చే నెల 23న కౌంటింగ్ ముగిసిన త‌ర్వాత గానీ కోడ్ ముగియ‌దు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌ర్కారు అప్ప‌టిదాకా ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వంగానే ఉంటుంది.

అయితే పోలింగ్ కు, కౌంటింగ్ కు ఈ మేర గ్యాప్ పెట్టి... నెల‌ల త‌ర‌బ‌డి పాల‌న‌ను ప‌క్క‌న‌పెట్టి కూర్చోమంటే ఎలా కుదురుతుంద‌ని చంద్ర‌బాబు అండ్ కో గుర్రుగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఓ రెండు స‌మీక్ష‌ల‌కు చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్ట‌గానే విప‌క్ష వైసీపీ వేగంగానే స్పందించి ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో చంద్ర‌బాబు స‌మీక్ష‌కు హాజ‌రైన అధికారుల‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎంట్రీ ఇచ్చిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, చంద్ర‌బాబు ఆప‌ద్ధ‌ర్మ కేబినెట్ లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి... స‌మీక్షల వివాదాన్ని మ‌రింత ముదిరేలా చేశారు.

నెల‌ల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వ పాల‌న లేకుంటే ప‌రిస్థితి ఏమిటన ప్ర‌శ్నించిన సోమిరెడ్డి... తాను మాత్రం త‌న శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించి తీర‌తాన‌ని స‌వాల్ విసిరారు. అంతేకాదండోయ్‌... తాను వ్య‌వసాయ శాఖ‌పై స‌మీక్ష చేస్తున్నాన‌ని, అడ్డుకునేవారెవ‌రు వ‌స్తారో చూస్తానంటూ కూడా బ‌స్తీ మే స‌వాల్ అన్న రీతిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ త‌న స‌మీక్ష‌ను అడ్డుకుంటే... ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ‌తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ స‌వాల్ ఏపీలో కొత్త చ‌ర్చ‌ల‌కు తెర లేప‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.