Begin typing your search above and press return to search.

అమాత్యులే ఉల్లంఘ‌నులు!..టాప్ ప్లేస్ ఈయ‌న‌దే!

By:  Tupaki Desk   |   6 May 2019 10:51 AM GMT
అమాత్యులే ఉల్లంఘ‌నులు!..టాప్ ప్లేస్ ఈయ‌న‌దే!
X
తెలంగాణ‌లో పాల‌న గాడి త‌ప్పిన‌ట్టుగా విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు త‌గ్గ నిద‌ర్శ‌నాలు లెక్క‌లేన‌న్ని క‌నిపిస్తున్నాయి. ఇంట‌ర్ వివాదంలో తప్పు జ‌రిగింద‌ని ఒప్పేసుకున్నా... చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని వైనం చూస్తుంటే... పాల‌న అట‌కెక్కిన‌ట్టే క‌దా. తాజాగా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేయ‌డం - ఛ‌లానాలు వేస్తే రుసుము క‌ట్ట‌కుండా స‌తాయించ‌డం - చివ‌ర‌కు లీగ‌ల్ నోటీసులు జారీ అయినా చీమ కుట్టిన‌ట్టు కూడా భావించ‌ని ప్ర‌ముఖుల జాబితా చూస్తే విస్తుపోవ‌డం మ‌న వంతు అవుతుంది.

ఎందుకంటే... ఈ జాబితాలో డ‌బ్బు మ‌దంతో కొవ్వెక్కి ప్ర‌వ‌ర్తించే వారితో పాటు రాష్ట్రంలో పాల‌న‌ను గాడిన పెట్టాల్సిన గురుత‌ర బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో తెలంగాణ ఉద్య‌మంలో గెజిటెట్ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధిగా త‌న‌దైన శైలిలో గొంతెత్తి - ఆ త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తి - తొలుత ఎమ్మెల్యే - ఇప్పుడు ఏకంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న శ్రీ‌నివాస్ గౌడ్ టాప్ ప్లేస్ ను ఆక్ర‌మించిన వైనం చూస్తుంటే... తెలంగాణ‌లో నిజంగానే పాల‌న అట‌కెక్కింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మంత్రులే ఉల్లంఘనుల జాబితాలో ఉంటుంటే... పాల‌న అట‌కెక్కింద‌ని చెప్ప‌క ఇంకేం చెప్పాలి. స‌రే... ఈ ట్రాఫిక్ వాయిలేష‌న్స్ కు సంబంధించి మ‌న అమాత్యులు చేసిన ఘ‌న కార్యాలు ఏమిట‌న్న విష‌యాల్లోకి వెళితే... అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్ కు గాను ఎక్కువ మొత్తంలో ఛ‌లానాలు పొందిన నేతల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ టాప్‌ ప్లేస్‌ లో ఉన్నారు. ఆయన వాహనంపై రూ.46,300 మేర చలానాలు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇవన్నీ 2016 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 26 వరకు నమోదైనవే. మొత్తం 40 చలానాల్లో 36 అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్‌ కు సంబంధించినవే. ఆయన సతీమణి శారద పేరిట ఉన్న కారుపైనా రూ. 16,390 మేర 14 పెండింగ్‌ చలానాలున్నాయి. వాటిల్లో 13 అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్‌ వల్ల విధించినవే.

మరో మంత్రి ఈటల పేరిట కార్లు లేకున్నా.. ఆయన భార్య జమునకు మూడు కార్లు ఉన్నాయి. వాటిపై వరసగా.. రూ. 2,475 - రూ. 5,740 - రూ.18,760 చొప్పున పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో నాలుగింటిపై పోలీసులు 2018లో లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ముషీరాబాద్‌ టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కు మూడు చలానాల బకాయిల విషయంలో పోలీసులు లీగల్‌ నోటీసులు పంపారు. ఆయన వాహనంపై రూ. 3,115 మేర మొత్తం 9 చలానాలు ఉన్నాయి. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డికి చెందిన వాహనానికి సంబంధించిన ఏడు చలానాల్లో.. నాలుగింటికి లీగల్‌ నోటీసులు జారీ అయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ వాహనానికి 11 చలానాలు జారీ అయ్యాయి. రూ. 8,785 చెల్లించాల్సి ఉంది. 2015 అక్టోబరులో లీగల్‌ నోటీసులు పంపారు.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన పేరిట టీఎస్‌31-0009 - టీఎస్‌ 06ఈబీ-9999 - టీఎస్‌32బీ-0009 నంబర్లతో మూడు కార్లు - తన సతీమణి పేరిట టీఎస్06ఈఎఫ్‌-8055 నంబరుతో ఒక కారు ఉన్నాయని అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట ఉన్న కారుకు జారీ అయిన చలానాలను పరిశీలించగా ఆమె కారు నంబరును ఒక యువకుడు తన బైక్‌ పై వేయించుకున్నాడు. దానిపై 6 చలానాలు జారీ అయ్యాయి. ఇది మ‌న అమాత్యులు - ప్ర‌జా ప్ర‌తినిధుల ట్రాఫిక్ వాయిలేష‌న్స్ లెక్క‌.