Begin typing your search above and press return to search.

గురువుకు తగ్గ శిష్యుడు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

By:  Tupaki Desk   |   10 July 2020 2:30 AM GMT
గురువుకు తగ్గ శిష్యుడు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X
గురువుకు తగ్గ శిష్యుడనే మాటకు సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా వ్యవహరించి టీఆర్ఎస్ లో స్వల్ప వ్యవధిలో ఎదిగిన నేతగా ఆయన్ను అభివర్ణిస్తారు. గులాబీ పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నా.. వారిని కాదని సారు మనసును దోచేయటంలో శ్రీనివాస్ గౌడ్ తర్వాతే ఎవరైనా అంటారు. ఉద్యమ వేళలో ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నా మంత్రి పదవిని దక్కించుకోవటంలో వెనుకబడిన వారందరికి శ్రీనివాస్ గౌడ్ గైడ్ గా అభివర్ణిస్తారు.

ఆ మధ్యన సచివాలయానికి సీఎం ఎందుకు వెళ్లరంటూ అడిగిన ప్రశ్నకు.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇచ్చిన సమాధానం గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఎక్కడ ఉంటే ఏమిటి? సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎంవో అంటూ పాలనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురికి నేత్రాలు విచ్చుకునేలా చేశాయని చెప్పాలి. తాజాగా.. అలాంటి మాటలే కేసీఆర్ అనుంగ శిష్యుడైన శ్రీనివాస్ గౌడ్ నోటి నుంచి రావటం ఆసక్తికరం.

ముఖ్యమంత్రి ఎక్కడ? అంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ చెబుతూ దూకుడుగా బదులిచ్చారు శ్రీనివాస్ గౌడ్. సీఎం ఎక్కడ ఉంటే ఏమిటి? రాష్ట్రంలో ఏ పథకమైనా ఆగిందా? ఆయన పట్టుదల.. ధైర్యం.. స్థిరత్వం ఏమిటో గతంలో చేసిన దీక్షతోనే తెలిసింది. ఆయనది బలమైన గుండె.. గట్టిగా ఉన్నారు.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటల్ని చెబుతున్న వైనం పలువురిని అవాక్కు అయ్యేలా చేసింది.

కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా ఆంధ్రాలో ఉందా? అంటూ విరుచుకుపడిన ఆయన.. తెలంగాణ గడ్డ నుంచే పాలన సాగిస్తున్నారు కదా? అంటూ లాజిక్ లేని వాదనను వినిపించారు. మొత్తంగా చూస్తే.. ముఖ్యమంత్రి ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదన్నట్లుగా మంత్రివారి మాటలు వింటే.. కేసీఆర్ కోరుకునే టాలెంట్ శ్రీనివాస్ గౌడ్ లో టన్నుల లెక్కన ఉందని చెప్పక తప్పదు. అందుకేనేమో.. అతి తక్కువ వ్యవధిలో పార్టీలో అంతలా ఎదిగింది?