Begin typing your search above and press return to search.

కేసీఆర్ కారణంగా తలసానికి జరిమానా.. జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్

By:  Tupaki Desk   |   15 Feb 2020 5:16 PM GMT
కేసీఆర్ కారణంగా తలసానికి జరిమానా.. జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్
X
మంత్రి అయినా.. సాధారణ మనిషి అయినా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ఈజ్ రూల్ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ కి జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బం గా నగరం లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌.

‘వియ్ లవ్ యూ కేసీఆర్’ అని పేర్కొంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తన ఫొటోలతో కూడిన భారీ కటౌట్ రెడీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. నగరంలోని ఐమాక్స్ సమీప కూడలి దగ్గర జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో ఉన్న పార్కులో దీన్ని ఏర్పాటు చేశారు. చూడటానికి సూపర్ గా ఉండి, అందరినీ ఆకర్షిస్తున్న ఈ హోర్డింగ్.. జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం కోపం తెప్పించింది. ఇది చూసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ కి జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. అనుమతి లేకుండా ఈ కటౌట్‌ ఏర్పాటు చేశారని తెలుపుతూ, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ నగర రహదారుల వెంట అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే చాలాసార్లు అధికారులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ''రూల్ ఈజ్ రూల్'' అనేలా జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఈ పనిని పలువురు అభినందిస్తున్నారు.