Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి `నాసా`ఫొటోల ట్వీట్ వైరల్!
By: Tupaki Desk | 30 April 2018 12:03 PM GMTత్వరలో జరగబోతోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలని భావిస్తోన్న బీజేపీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఓ పక్క ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలతో పోరాడేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోన్న బీజేపీకి సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు చేటుతెస్తున్నాయి. మొన్నటికి మొన్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత..జర్నలిస్టులనుద్దేశించి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలోని అన్ని గ్రామాలకు ఇపుడు విద్యుత్ సరఫరా అవుతోందంటూ....నాసా ఫోటోలను పియుష్ పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని పియుష్ ట్వీట్ చేశారు. అయితే, అందులో భాగంగా ఆయన నాసా గతంలో పోస్ట్ చేసిన ఫొటోలను వాడారు. దీంతో, నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ``మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతోంది’ అని చేసిన ట్వీట్ ఫొటోలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ ఫోటోలు షేర్ చేయక ముందే బీజేపీ సోషల్ మీడియా విభాగం క్షుణ్ణంగా తనిఖీ చేస్తే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అవి 2012, 2016లో నాసా విడుదల చేసిన ఫోటోలని మరొకరు కామెంట్ పెట్టారు. ప్రతీ దీపావళి పండగ మరుసటి రోజు ఈ ఫోటోలను నాసా పోస్ట్ చేస్తుందని, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయని మరో యువతి ట్వీట్ చేసింది. దీంతో, పియుష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మణిపూర్ లోని సేనాపతి జిల్లా లాయ్‌సాంగ్ గ్రామానికి శనివారంనాడు విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఆ గ్రామానికి విద్యుత్ అందించడంతో దేశంలో అన్ని గ్రామాలను విద్యుదీకరించామని మోదీ ప్రకటించారు.
కాగా, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ విప్లవ్ మొదలెట్టిన సంచలన వ్యాఖ్యల పరంపర....నిరుద్యోగులు ఆవులను పెంచుకోవాలని సూచించడం వరకూ వెళ్లింది. ఈ మధ్యలో .....పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యానించడం...మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్ పై అవమానకర వ్యాఖ్యలు చేయడం...సివిల్ సర్వీసెస్ కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లు సూట్ అవుతారని, చదువుకోవడం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విప్లవ్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. విప్లవ్ వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి చేటు తెచ్చేలా ఉండడంతో మే 2న తన ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని ప్రధాని ఆదేశించినట్లు పీఎంవో కార్యాలయం సమన్లు జారీ చేసింది.
మరోవైపు, జర్నలిస్టులపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఉన్న సమాచారమంతా నారద మహర్షి దగ్గర ఉందని, గూగుల్‌ను ఆయనతో పోల్చవచ్చని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నారదుడు మనుషుల మధ్య గొడవలు పెట్టేవాడని, రూపానీ అన్నారు. అంతేకాదు, నారదుడు నిజమైన జర్నలిస్టు అని, ప్రస్తుతమున్న జర్నలిస్టులు కూడా నారదుడి లాగే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.