Begin typing your search above and press return to search.

చిరుత `వేట‌` క‌రెక్టే...మంత్రిగారి స‌మ‌ర్థ‌న‌!

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:19 PM GMT
చిరుత `వేట‌` క‌రెక్టే...మంత్రిగారి స‌మ‌ర్థ‌న‌!
X
అది ఉత్త‌ర మ‌హారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఉన్న‌ ఛలీస్‌ గావ్ గ్రామం. ఆ గ్రామంలో గ‌త నాలుగు నెల‌లుగా ఓ చిరుత మ‌నుషుల‌ను - ప‌శువుల‌ను చంపి తినేస్తోంది. ఆ చిరుత సంచారం స్థానికుల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు రేపుతోంది. దీంతో, ఆ చిరుత‌ను క‌నిపించిన చోటే కాల్చి వేసేందుకు అట‌వీ శాఖ అధికారుల‌కు - పోలీసుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. అయితే, ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ ఆ చిరుత‌ను మ‌ట్టుబెట్ట‌లేక‌పోయారు. దీంతో, ఆ చిరుత‌ను అంత‌మొందించేందుకు స్వ‌యంగా ఓ మంత్రి గారు రంగంలోకి దిగారు. అట‌వీ శాఖ సిబ్బంది - పోలీసులతో క‌లిసి `సాయుధుడై` `వేట‌గాడి`గా మారారు. లైసెన్స్డ్ రివాల్వ‌ర్‌ ప‌ట్టుకొని ఆ చిరుత‌ను వేటాడారు. అయితే, ఈ `వేట‌గాడి`ని చూసిన చిరుత ప‌లాయ‌నం చిత్త‌గించింది. దీంతో, ఆ చిరుత‌ను చంపి వేట‌గాళ్ల‌కు `వేట‌గాడు` అవుదామ‌నుకున్న మంత్రిగారి ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. అయితే, ఈ మంత్రి గారి `వేట‌`వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. సాక్ష్యాత్తూ మంత్రి హోదాలోని వ్య‌క్తి బ‌హిరంగంగా ఆయుధం చేప‌ట్టి చిరుత‌ను వేటాడ‌డంపై కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే, త‌న `వేట‌`ను మంత్రిగారు స‌మ‌ర్థించుకుంటున్నారు. ఇది కూడా ప్ర‌జాసంక్షేమంలో భాగ‌మేన‌ని సెల‌విచ్చారు.

గ‌త నెల‌న్న‌ర రోజుల నుంచి ఆ జిల్లాలో చిరుత ఐదుగురిని పొట్ట‌న బెట్టుకుంద‌ని - సోమ‌వారం బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాను వెళ్లాన‌ని మహాజన్ చెప్పారు. అక్కడి నుంచి తిరుగు ప్ర‌యాణ‌మైన సంద‌ర్భంలో త‌న కాన్వాయ్ కు 400 మీట‌ర్ల దూరంలో అట‌వీ శాఖ - పోలీసు సిబ్బందికి చిరుత క‌నిపించింద‌ని - దీంతో వెంట‌నే కారు దిగి వారితో క‌లిసి దానిని వెంబ‌డించాన‌ని తెలిపారు. ఒక ప్ర‌జాప్ర‌తినిధిగా - త‌న సొంత జిల్లాకు మంత్రి అయినందున‌ ఆ చిరుత‌ను వేటాడ‌డంలో పాలుపంచుకున్నాన‌ని - భ‌ద్రంగా త‌న కారులోనే కూర్చోవాల‌నుకోలేద‌ని చెప్పారు. ఎప్పుడూ త‌న‌తో పాటు లైసెన్స్డ్ రివాల్వ‌ర్ ను తీసుకెళ్తాన‌ని - అవ‌స‌రం లేకుంటే కారులోనే వ‌దిలి వెళ్తాన‌ని చెప్పారు. కాగా, మహాజన్ కు ఈ త‌ర‌హా `రివాల్వ‌ర్` వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో ఓ పాఠ‌శాలలో జ‌రిగిన కార్య‌క్రామానికి మ‌హాజ‌న్‌....రివాల్వ‌ర్ తో హాజ‌ర‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన మ‌హాజ‌న్‌...త‌న‌తో పాటు రివాల్వ‌ర్ ను తీసుకెళ్ల‌డం వివాదాస్పద‌మైంది. తాజాగా, మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపారు. ఆ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వ‌డంతో త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో దావూద్ ఇబ్ర‌హీం బంధువు వివాహ వేడుక‌లో స‌ద‌రు మంత్రిగారు పాల్గొన్న‌ట్లు అన‌ధికార వార్త‌లు వెలువ‌డ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేపింది.