Begin typing your search above and press return to search.

మంత్రులుగా వచ్చి మాజీలయ్యారా ?

By:  Tupaki Desk   |   8 April 2022 6:03 AM GMT
మంత్రులుగా వచ్చి మాజీలయ్యారా ?
X
తాజాగా పదవులకు రాజీనామాలు చేసిన మంత్రుల వ్యవహారం విచిత్రంగా ఉంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి మంత్రులుగా వచ్చి సమావేశం అవ్వగానే మాజీలైపోయారు. ఒక్కసారిగా మొత్తం మంత్రివర్గం నుండి ఒకేసారి రాజీనామాలు తీసుకోవటం అసాధారణమనే చెప్పాలి. గతంలో ఎప్పుడో బడ్జెట్ లీకయిందనే కారణంతో ఎన్టీయార్ తన మంత్రివర్గంను మార్చేశారు. అప్పట్లో మంత్రులందరిపైన ఎన్టీయార్ ఒకేసారి వేటు వేశారు.

అయితే ఇపుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేయలేదు. మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే 90 శాతం మంత్రులను రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

రెండున్నర సంవత్సరాల తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానని చెప్పారు కాబట్టి మంత్రులంతా మానసికంగా మాజీలయ్యేందుకు సిద్ధమయ్యే ఉన్నారు. కాకపోతే మూడేళ్ళు మంత్రులుగా చేసి రాజీనామాలు చేయాలంటే ఎవరికైనా బాధగా ఉంటుందనటంలో సందేహం లేదు.

క్యాబినెట్ సమావేశం తర్వాత మాజీలైన వారంతా జగన్ పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. సరే ఇదంతా మామూలుగా జరిగేదే. ఇక కొత్త మంత్రివర్గంలో చేరబోయేవారిని సామర్థ్యం, సామాజికవర్గాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు చేసిన రాజీనామాలన్నీ గవర్నర్ కార్యాలయంకు చేరుకున్నాయి. రాజీనామాల ఫైలు పై గవర్నర్ సంతకం పెట్టగానే అందరు మాజీలైపోతారు.

ఇదే సమయం లో కొత్త క్యాబినెట్ లో చేరబోయే సహచరుల పేర్లతో జగన్ శుక్రవారం లేదా శనివారం రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు అందించగానే 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తాన్ని కూడా గవర్నర్ కు జగన్ చెప్పబోతున్నారు.

జగన్ చెప్పేదానికి బట్టి రాజ్ భవన్ కార్యాలయం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. మొత్తానికి మంత్రులుగా వచ్చి మాజీలుగా క్యాబినెట్ సమావేశం నుండి అందరూ ఒకేసారి వెళ్ళటం అరుదనే చెప్పాలి.