Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో ఏపీ క‌ల‌లు క‌ల్ల‌లే

By:  Tupaki Desk   |   2 Feb 2017 12:48 PM IST
ఆ విష‌యంలో ఏపీ క‌ల‌లు క‌ల్ల‌లే
X
కేంద్ర బ‌డ్జెట్ విష‌యంలో అమ‌రావ‌తి వాసుల్లో మిన‌హా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున్నే అసంతృప్తి క‌నిపిస్తోంది. కేంద్ర బడ్జెట్‌ లో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి నయాపైసా కేటాయింపు లేకపోవటం చూసి ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు - అశోక్ గజపతిరాజు - సుజనాచౌదరి ఇటీవల ప్రకటించిన విధంగా అంతర్జాతీయ స్థాయి హోదా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మితమైన అధునాతన టెర్మినల్‌ కు ఇటీవలే అత్యంత‌ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. అంతర్జాతీయంగా విమానాల రాకపోకలు సాగించే రీతిలో ఏడాదిలోనే మరో శాశ్వత టెర్మినల్‌ ను నిర్మించనున్నామని కూడా మంత్రులు ఆ నాటి సభలో స్వయంగా ప్రకటించారు. కృష్ణా గుంటూరు - ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వేలాది మంది అమెరికా - దుబాయ్ - ఇంగ్లాండ్ వంటి విదేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా నేరుగా రాకపోకలు సాగించేలా విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పిస్తామంటూ కేంద్ర మంత్రులు హామీనిచ్చినపుడు ఈ ప్రాంత వాసులు ఎంతో సంబరపడ్డారు.

ఇక ఇదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పండే పండ్లు - ఇతర వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా కార్గో సర్వీసులు కూడా నడపాలని కోరారు. కొత్త టెర్మినల్ నిర్మాణం జరిగినపుడు తాజాగా ప్రారంభమైన టెర్మినల్ నుంచి కార్గొ సర్వీస్‌ లు నడపగలమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌ లో ఆ హామీలు నెరవేర్చే దిశలో కేటాయింపులు మాత్రం కన్పించడం లేదు. దీంతో అంతర్జాతీయ స్థాయి కలగానే మిగులతుందా అనే అనుమానం కలుగుతోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ హోదా ద‌క్కేందుకు మ‌రో ఏడాది వేచి చూడాల్సిందేన‌ని ఈ నేప‌థ్యంలో అంత అర్భాట‌పు ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు స‌హ‌జంగానే విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/