Begin typing your search above and press return to search.

ప్రధాని ప్రసంగం మంత్రులకు జోలపాట!

By:  Tupaki Desk   |   15 Aug 2016 3:27 PM IST
ప్రధాని ప్రసంగం మంత్రులకు జోలపాట!
X
70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ ప్రసంగం కొత్త రికార్డులను కూడా సృష్టించింది. ఈ క్రమంలో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్షంగానూ - టీవీల్లోనూ చాలామంది శ్రద్ధగా విన్నారు. అయితే అసెంబ్లీల్లోనూ - ముఖ్యమైన సభల్లోనూ కునుకు తీసే అలవాటులో భాగమో లేక ధ్యానముద్రలోకి వెళ్లాలనే తాపత్రయమో కానీ.. మోడీ ప్రసంగ సమయంలో కొంతమంది నేతలు కునిపాట్లు పడితే.. మరికొందరు నేతలు ఏకంగా ఒక కునుకే తీసేశారు.

సరేలే ఒకరో ఇద్దరో కాస్త పెద్ద వయసువారు ఏదో కునుకు తీశారంటే వయసురీత్యానో లేక అనారోగ్యం కారణంగానో అలసిపోయారేమో అని సర్ధుకుపోవచ్చు. పోనీ ప్రతిపక్షంలో ఉన్న వారు.. మోడీ ప్రసంగం బోర్ కొట్టించేలా, నిద్రబుచ్చేలా ఉందని చెప్పడానికన్నట్లు ఒక కునుకు తీసినా సరే అనుకోవచ్చు కానీ... బీజేపీ నేతలు - మోడీ టీం మెంబర్లు - కేంద్ర మంత్రులు కూడా మోడీ ప్రసంగ సమయంలో కునిపాట్లు పడుతూ కెమేరాలకు చిక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రమంత్రులు మనోహర్‌ పరీకర్ - అరుణ్‌ జైట్లీ - అనంత కుమార్‌ లతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఒక కునుకేసేసినట్లు కనిపించారు. దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అవ్వడంతో పాటు ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి.

కాగా.. స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ కొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించారు. ఈ సంగతి అలా ఉంటే.. మోడీ ప్రసంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సహా ఇతర కోర్టుల న్యాయమూర్తుల పెండింగ్ నియామకాలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఠాకూర్ వ్యాఖ్యానించారు.