Begin typing your search above and press return to search.

అక్కడ మంత్రులు వెయిటింగ్...వారి కోసమేనట‌... ?

By:  Tupaki Desk   |   24 Jan 2022 11:29 AM GMT
అక్కడ మంత్రులు వెయిటింగ్...వారి కోసమేనట‌... ?
X
మంత్రులు అంటేనే ఆ దర్జా దర్పం వేరుగా ఉంటుంది. వారికి కలవడానికి అవత‌ల వారు వెయిట్ చేయాలి. ఎన్నో సార్లు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడాలి. కానీ ఏపీలో సీన్ కాస్తా రివర్స్ లో ఉందిపుడు. మంత్రులు సచివాలయంలో కొన్ని గంటలుగా వెయిట్ చేస్తున్నారు. కానీ రావాల్సిన వారి నుంచి సమాచారం అయితే లేదు. ఇంతకీ ఏమా కధ అంటే ఏపీ ఉద్యోగ సంఘ నేతల కోసమే మంత్రులు అక్కడ వెయిట్ చేస్తున్నారుట.

దీనికి ముందు ఫోన్ ద్వారా ఉద్యోగ సంఘ నేతలను చర్చలకు పిలిచారు. అయితే వారు ఏమన్నారు అన్నది బయటకు తెలియలేదు కానీ మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొత్త పీయార్సీ జీవోలు రద్దు చేస్తే తప్ప తాము చర్చలకు వెళ్లమని చెబుతున్నారని. మొత్తానికి ప్రభుత్వం జీవోలు రద్దు చేయకుండా తాము చర్చలకు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదని వారు భావిస్తున్నారుట.

ఈ టైమ్ లో యధా ప్రకారం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ అయితే సెక్రటేరియట్ కి ఉదయాన్నే వచ్చేసింది. మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిలతో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాల నేతల కోసం గంటల తరబడి వెయిట్ చేసింది.

అయితే హై కోర్టులో ఈ కేసు విచారణకు ఉండడంతో ఉద్యోగ సంఘ నేతలు ఆ వైపే దృష్టి పెట్టారని అంటున్నారు. మరో వైపు చూస్తే సమ్మెకు తాము రెడీ అని కూడా అంటున్నారు. ఈ కీలకమైన సమయంలో హై కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇపుడు ఉద్యోగ సంఘ నేతల్లో కలవ‌రం కలిగిస్తున్నాయి అంటున్నారు.

జీతాలు తాము ఎంత కోరితే అంత పెంచాలనడం తమ జన్మ హక్కుగా ప్రభుత్వ ఉద్యోగులు చెబుతూంటే ఇప్పటిదాకా సామన్య జనాలూ అదే నిజం అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వానికి జీతాలు పెంచడమే కాదు తగ్గించే హక్కులు ఉన్నాయని హై కోర్టు చేసిన కామెంట్స్ తో పాటు పీయార్సీ ని ఎలా సవాల్ చేస్తారు అన్న ప్రశ్నలతో ఉద్యోగ సంఘాలు ఇపుడు ఏ రకంగా ముందుకు సాగుతారు అన్నదే చర్చగా ఉంది.

సమ్మెకు తాము రెడీ అని చెబుతున్నారు. అయితే సమ్మె పేరుతో బెదిరిస్తారా అంటూ కోర్టు అడగడంతో ఉద్యోగుల తదుపరి స్టెప్ ఎలా ఉంటుందో కూడా అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి చూస్తే మంత్రులను వెయిటింగ్ లో పెట్టడం మాత్రం మొత్తం ఎపిసోడ్ లో అతి పెద్ద ట్విస్ట్ గానే అంటున్నారు.