Begin typing your search above and press return to search.

చుట్టం చూపుగా వెళ్లి చంపేసింది

By:  Tupaki Desk   |   27 Nov 2019 4:53 AM GMT
చుట్టం చూపుగా వెళ్లి చంపేసింది
X
తమిళనాడులోని 31 ఏళ్ల మహిళ హత్య వెనుక కారణం బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసింది ఇద్దరు మైనర్లు అన్న నిజం పోలీసుల విచారణలో తేలింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమె చావుకు కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేసింది. కొడైక్కెనాల్ కు సమీపంలో కేశవన్.. సుందరి దంపతులు ఉండేవారు. వారికి పదకొండేళ్ల కుమార్తె ఉండేది.

ఆ దంపతులు తరచూ గొడవలు పడేవారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. కుమార్తెను భర్త తన వద్దే ఉంచేసుకున్నాడు. ఆమె ఒక్కతే ఉంటోంది. ఆమె నివాసానికి దగ్గర్లో ఉండే మురుగన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో.. వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. మురగన్ చెన్నైలో పని చేస్తుండటంతో ఆమె ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఒక రాత్రి ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది.

అందరి వేళ్లు మురగన్ వైపు వెళ్లాయి. లేదంటే.. విడిపోయిన భర్త ఈ మరణానికి కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ షురూ చేశారు. ప్రతి విషయాన్ని పోలీస్ కోణంలో చూసిన అధికారులు చివరకు సుందరి దారుణహత్యకు గురైందని గుర్తించారు. అంతేకాదు.. ఆమె హత్యకు అసలు కారణం తెలిసి అవాక్కు అయ్యారు.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఎలా అయితే.. చివర్లో విలన్ అనూహ్యంగా తెర మీదకు వస్తాడో.. అదే రీతిలో సుందరి హత్య వెనుకా ఉందన్న నిజాన్ని గుర్తించారు. హత్య జరిగిన రాత్రి సుందరి సమీప బంధువు కుమార్తె ఆమె ఇంటికి చుట్టంచూపుగా వచ్చింది. అయితే.. ఆ మైనర్ బాలికకు ఒక ఎఫైర్ ఉంది. సుందరి ఇంట్లో లేని వేళలో తన మైనర్ ప్రియుడ్ని ఇంటికి రావాలని బాలిక కోరింది.

అలా వారిద్దరూ ఏకాంతంలో ఉన్న వేళ.. అనూహ్యంగా సుందరి ఇంటికి వచ్చింది. వారిద్దరి పాడుపని చూసి కోపం కట్టలు తెంచుకుంది. వారిద్దరి భాగోతానని వారింట్లో చెప్పేస్తానని ఫైర్ అయ్యింది. అంతే.. తమ భాగోతం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో.. సుందరిని చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు.

అనంతరం మైనర్ బాలిక ప్రియుడు పారిపోగా.. సుందరి హటాత్తుగా మరణించినట్లు చుట్టంచూపుగా వచ్చిన మైనర్ బాలిక నాటకమాడింది. అనుమానంతో పట్టి పట్టి చూస్తున్న పోలీసులు మైనర్ బాలికను ప్రశ్నించే క్రమంలో తడబడి.. పొంతనలేని సమాధానాలు ఇవ్వటంతో లోతుగా విచారిస్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. హత్యలో పాలుపంచుకున్న మైనర్ బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.