Begin typing your search above and press return to search.
రాహుల్ టూర్ అసలు లక్ష్యం ఇదే!
By: Tupaki Desk | 17 Oct 2018 6:43 AM GMTదేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో - తెలంగాణలోనూ ఒకప్పుడు అదే పరిస్థితి ఉండేది. కానీ, కొన్నాళ్లుగా పరిస్థితులు తారుమారవుతున్నాయి. మైనారిటీలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారు. మైనారిటీ ఓట్లు తమ పేటెంట్‌కు భావించే ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్ కూడా వారి ఓట్లను తన్నుకపోతున్నాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు, తిరిగి మైనారిటీలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
మైనారిటీ ఓటర్లు క్రమంగా తమకు దూరమవుతుండటంతో కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. తిరిగి వారిని ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో జరపబోయే పర్యటనను కూడా ఇందుకు ఓ అస్త్రంగా ఉపయోగించుకోవాలని స్థానిక హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ నెల 20న రాహుల్ తెలంగాణ కు రానున్నారు. చార్మినార్, భైంసా, కామారెడ్ డిల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ మూడు ప్రాంతాలూ మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నవే కావడం గమనార్హం.
దూరమవుతున్న మైనారిటీలను తిరిగి దగ్గర చేసుకునే లక్ష్యం తోనే రాహుల్ టూర్‌ను ఆ మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖరారు చేసినట్లు సమాచారం. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్న రాహుల్.. భైంసా - కామారెడ్డిల్లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభల్లో మైనారిటీల పై కాంగ్రెస్ అధ్యక్షుడు వరాల జల్లు కురిపించే అవకాశముంది. ముస్లింలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ల పెంపు అంశం పై ప్రకటన చేసే సూచనలున్నాయి. గోవధ పేరుతో దేశవ్యాప్తంగా ముస్లింల పై జరుగుతున్న దాడులను కూడా రాహుల్ ఈ సభల్లో ప్రస్తావించే అవకాశాలున్నాయి. మరి మైనారిటీల పై కాంగ్రెస్ సంధించనున్న రాహుల్ అస్త్రం ఏమేరకు ఫలిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే!