Begin typing your search above and press return to search.

రోటీన్ గెట‌ప్ రాజ‌కీయాలు మొద‌లెట్టిన ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   5 April 2018 6:13 AM GMT
రోటీన్ గెట‌ప్ రాజ‌కీయాలు మొద‌లెట్టిన ప‌వ‌న్‌!
X
రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత కొన్ని చిన్నెలు త‌ప్ప‌నిస‌రి. రోటీన్ కు భిన్నంగా.. మార్పు కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా.. ఈ తుచ్ఛ రాజ‌కీయాల్ని స‌మూలంగా మార్చేస్తానంటూ భారీ డైలాగులు చెప్పే ప‌వ‌న్ లాంటోడు సైతం.. ఇప్పుడు గెట‌ప్ రాజ‌కీయాల్ని వ‌దిలిపెట్ట‌ని వైనం చూస్తే.. రాజ‌కీయాల్లోకి ఎవ‌రొచ్చినా ట్రెడిష‌న‌ల్ రాజ‌కీయాల నుంచి బ‌య‌ట‌కు రాలేర‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

తాజాగా హైద‌రాబాద్ లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో కొంద‌రు మైనార్టీలు ప‌వ‌న్ ను క‌ల‌వ‌టానికి వ‌చ్చారు. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరారు. ఇందులో భాగంగా ఒక విన‌తిప‌త్రాన్ని ఇవ్వ‌టంతో పాటు.. ఆయ‌న‌కు ముస్లింలు ధ‌రించే టోపీని ఇచ్చారు. అంతే.. వారిచ్చిన టోపీని పెట్టుకొని.. భుజాన కండువా క‌ప్పుకొని. త‌న‌ను క‌లుసుకునే వాళ్ల‌తో క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చేశారు.

నూర్ బాషా ముస్లిం (దూదేకుల‌) సంక్షేమ సంఘం ప్ర‌తినిధులు తీవ్ర పేద‌రికంలో ఉన్నార‌ని.. స‌బ్ ప్లాన్ ఏర్పాటు చేయించి త‌మ‌ను ఆదుకోవాల‌ని ప‌వ‌న్ ను వారు కోరారు. గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీ స‌ర్కారు మైనార్టీ సంక్షేమాన్ని విస్మ‌రించింద‌ని.. అటు వీసీ కార్పొరేష‌న్ కానీ.. మైనార్టీ కార్పొరేష‌న్ నుంచి కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నం అంద‌టం లేద‌న్నారు.

నూర్ బాషాల సంక్షేమం కోసం ఫెడ‌రేష‌న్ ఉన్నా పాల‌క‌మండ‌లి వేయ‌టం లేద‌ని ప‌వ‌న్ చెప్పారు. నూర్ బాషా ముస్లిం వ‌ర్గానికి తాను అండ‌గా ఉంటాన‌ని.. వారి త‌ర‌ఫున‌.. వారి హ‌క్కుల కోసం తాము పోరాడ‌తామ‌ని ప‌వ‌న్ హామీ ఇచ్చారు. ఈ త‌ర‌హా మాట‌లు.. గెట‌ప్ లు అంద‌రూ చేసేవే. ప‌వ‌న్ కూడా చేసేశారు. రోటీన్ రాజ‌కీయాల్నే ప‌వ‌న్ చేస్తున్న‌ప్పుడు ఆయ‌న సైతం గెట‌ప్ రాజ‌కీయాల్ని చేయ‌కుండా ఎందుకు ఉంటారు?