Begin typing your search above and press return to search.

దశాబ్ధంలోనే అతి దారుణ చలి ఇదేనట..

By:  Tupaki Desk   |   31 Jan 2019 6:06 AM GMT
దశాబ్ధంలోనే అతి దారుణ చలి ఇదేనట..
X
శీతాకాలం పూర్తవుతున్న సమయంలో చలి విజృంభిస్తోంది. తెలంగాణలో ఉత్తరాదిన ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠంగా 3 డిగ్రీలకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత మైనస్‌ లోకి వెళ్లిపోతుంది. ఉత్తరాదిన మైనస్‌ 1.1 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు వణుకుతున్నారు. దీనికి చలిగాలులే కారణమని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. దక్షిణ ఐరోపా నుంచి వస్తున్న గాలులతో ఉష్ణోగ్రత మైనస్‌ లోకి వెళుతుందని వారు పేర్కొంటున్నారు.

ఇక్కడి పరిస్థితి ఇలాగుంటే అమెరికాలో పరిస్థితులు దారుణంగా దిగజారాయి. చలి తీవ్రతకు అమెరికా గడ్డకట్టిపోతుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మైనస్‌ 50 వరకు చేరుకోవడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సరస్సుల ఉపరితలంపై మంచు పలకలు ఏర్పడ్డాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావడం లేదు. అధికారులు కూడా పాఠశాలలు, కొన్ని కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

చలి తీవ్రతకు పశ్చిమ అమెరికా మధ్య భూభాగం ఎక్కువగా ప్రభావితమైంది. మైనస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో మంచు వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ దాదాపు మంచు వర్షంతో నిండిపోయాయి. డకోట, ఉత్తర మిన్నెసోటాలలో -45 డిగ్రీలు నమోదవుతోంది. ఇక షికాగో మొత్తం మంచు ముద్దలా మారింది. దీంతో ఏ ఒక్క విమాన సర్వీసులు ప్రారంభం కావడం లేదు. 2300 విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. మరో 12 విమానాలు ఆలస్యం కానున్నాయి.

ఈ ప్రభావం అటు బ్రిటన్‌ పై పడింది. దేశంలోని పలు చోట్ల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మాంచెస్టర్‌, లివర్‌ ఫూల్‌ వంటి విమానాశ్రయాల్లో విమానాలు అక్కడే నిలిచాయి. ఇక్కడ మైనస్‌ 10 డిగ్రీలు నమోదు కావడంతో రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.