Begin typing your search above and press return to search.

విద్యార్ధుల పై 'నిమిషం' దెబ్బ

By:  Tupaki Desk   |   7 May 2022 8:31 AM GMT
విద్యార్ధుల పై నిమిషం దెబ్బ
X
ఇంటర్మీడియట్ విద్యార్ధులపై మళ్ళీ నిమిషం దెబ్బ పడింది. ఏపీలో శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలకు 5.12 లక్షల మంది హాజరుకావాల్సుండగా 4,98,494 మంది హాజరయ్యారు. అనేక కారణాల వల్ల కొందరు పరీక్షలకు హాజరుకాలేకపోయారు. అయితే పరీక్ష రాయలేకపోయిన వారిలో నిమిషం నిబంధన కూడా అడ్డుపడింది.

పరీక్ష మొదలైన ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా నిర్వాహకులు విద్యార్ధులను పరీక్ష రాయటానికి అనుమతించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 50 మంది విద్యార్ధులపై ఈ నిమిషం నిబంధన గట్టిగానే పడినట్లు సమాచారం. నిజానికి ఇలాంటి నిబంధననే పదవ తరగతి పరీక్షల్లో ఎత్తేశారు. పరీక్ష మొదలైన అర్ధగంటలోపు వచ్చిన విద్యార్ధులను పరీక్ష రాయటానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనేకమంది విద్యార్ధులు లబ్దిపాంరు.

ఏ విద్యార్ధి కూడా ఉద్దేశ్యపూర్వకంగా పరీక్షకు ఆలస్యంగా హాజరుకావాలని అనుకోడు. గట్టిగా మాట్లాడుకుంటే ఉదయం 9వ గంటకు పరీక్ష మొదలవుతుందని అందరికీ తెలుసు కాబట్టి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని విద్యార్ధులు ముందుగానే పరీక్షకేంద్రాలకు చేరుకోవాల్సుంటంది. అయితే ఎంత ముందుగా ప్లాన్ చేసుకున్నా ఏదో అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి ఆలస్యమవుతుంది. పరీక్ష మొదలై 5, 10 నిముషాలు ఆలస్యంగా చేరుకున్న విద్యార్ధులను కూడా అనుమతించలేదు.

నిజానికి పరీక్షకు కాస్త ఆలస్యంగా హాజరైతే నష్టపోయేది విద్యార్ధులే కానీ ప్రభుత్వం ఎంతమాత్రంకాదు. మూడుగంటల్లో రాయాల్సిన పరీక్ష ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులు తమకున్న సమయంలోనే పూర్తిచేయాల్సుంటుంది. పరీక్షకు విద్యార్ధులను అనుమతించటంలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేనపుడు ఎందుకు అడ్డుకుంటున్నారన్నదే అర్ధం కావటంలేదు.

నిమిషం నిబంధన సంవత్సరాల తరబడి ఉన్నదే అయినా 10వ తరగతి పరీక్షల్లో అనుమతించినట్లే ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా అనుమతిస్తే బాగుంటంది. పది నిముషాలు ఆలస్యంగా వచ్చారని పరీక్ష రాయటానికి అనుమతించని కారణంగా సదరు విద్యార్ధి విద్యా సంవత్సతరం నష్టపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.