Begin typing your search above and press return to search.

తప్పుదోవ పట్టించిన జీవీఎల్

By:  Tupaki Desk   |   10 Feb 2022 12:02 PM IST
తప్పుదోవ పట్టించిన జీవీఎల్
X
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనాలను తప్పుదోవ పట్టించారు. తొందరలోనే రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. తాను రైల్వే మంత్రితో మాట్లాడానని, తొందరలోనే ప్రక్రియ మొదలవుతుందుని తనతో చెప్పినట్లు చెప్పారు. జీవీఎల్ ప్రకటన విన్న కొందరు నిజమేనా అని ఆశ్చర్యపోయారు. ఏమో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, మోడీ కూడా ఏపీకి జరిగిన విభజన నష్టాలపై చాలా సేపు బాధ పడ్డారు కదా అని అనుకున్నారు.

తీరా చూస్తే రైల్వేశాఖ మంత్రి రావ్ సాహెబ్ పాటిల్ చేసిన ప్రకటన ఏమిటంటే తొందరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతోందని. అంటే జీవీఎల్ చెప్పినట్లు ప్రారంభమవుతోంది వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ కాదు కేవలం దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాత్రమే.

ఈ రెండు రైల్వే జోన్లకు చాలా తేడా ఉంది. విభజన చట్టంలో చెప్పినట్లు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే దేశంలోనే అత్యధిక బిజినెస్, సంపద కలిగిన రైల్వే జోన్ అయిపోయే అవకాశముంది.

ఎందుకంటే ఇపుడు ఒడిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న రైల్వేజోన్ పరిధిలో వైజాగ్ డివిజన్ ఉంది. భువనేశ్వర్ జోన్ కు వస్తున్న ఆదాయంలో అత్యధికంగా వైజాగ్ డివిజన్ నుంచి బిజినెస్ వెళుతోంది. వైజాగ్ షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, రకరకాల మైనింగ్ ఉత్పత్తుల కారణంగానే అత్యధిక ఆదాయం వస్తోంది. రేపు వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటైతే ఆ బిజినెస్ అంతా భువనేశ్వర్ కు ఆగిపోయి వైజాగ్ జోన్ కు వెళుతుంది.

ఈ కారణంగానే వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కానీయకుండా ఒడిస్సా అడ్డుకుంటోందని ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ ఉనికి కోసమే అవస్థలు పడుతోంది కాబట్టి ఏమి చేసినా ఉపయోగం లేదన్న కారణంగానే నరేంద్ర మోడీ సర్కార్ తుంగలో తొక్కేస్తోంది.

ఇంతోటి దానికి జీవీఎల్ జనాలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్ధం కావటం లేదు. బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. కాబట్టి జీవీఎల్ ఎంతమాయ చేద్దామని ప్రయత్నించినా ఉపయోగం ఉండదని గ్రహిస్తే మంచిది.