Begin typing your search above and press return to search.

రికార్డ్ రిపీట్: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

By:  Tupaki Desk   |   10 March 2017 10:43 AM GMT
రికార్డ్ రిపీట్: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
X
రవిశాస్త్రి అప్పుడెప్పుడో దేశవాళీ క్రికెట్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదితే దాని గురించి ఏళ్లకు ఏళ్లు చెప్పుకున్నాం. ఐతే దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ హెర్షలే గిబ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ ఆ రికార్డును అందుకున్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేసి ఔరా అనిపించాడు. ఐతే వీటన్నింటికీ మించిన వినోదం మాత్రం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ మెరుపులే. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ల స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆరు బంతులు-ఆరు సిక్సర్ల రికార్డును అందుకున్నాడు పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ మిస్బావుల్ హక్.

హాంకాంగ్ లో జరుగుతున్న టీ20 లీగ్ టోర్నమెంట్లో మిస్బా వరుసగా ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదేశాడు. ఐతే ఈ రికార్డులో చిన్న ట్విస్టుంది. అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టలేదు. 19వ ఓవర్లో చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లు అందుకున్న మిస్బా.. ఆ తర్వాత 20వ ఓవర్ మూడో బంతికి స్ట్రైకింగ్ కు వచ్చి చివరి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాదేసి ఔరా అనిపించాడు. ఇలా వేర్వేరు ఓవర్లలో వరుసగా ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడు మిస్బానే. 43 ఏళ్ల వయసులో మిస్బా ఇలా సిక్సర్ల మోత మోగించడం విశేషమే. ఈ మ్యాచ్ లో మిస్బా జట్టు 200కు పైగా స్కోరు చేసి సునాయాసంగా ప్రత్యర్థిని ఓడించింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/