Begin typing your search above and press return to search.

కనిపించకుండా పోయిన చంద్రబాబు..పీఎస్ లో ఫిర్యాదు !

By:  Tupaki Desk   |   24 Dec 2019 6:08 PM IST
కనిపించకుండా పోయిన చంద్రబాబు..పీఎస్ లో ఫిర్యాదు !
X
టీడీపీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి - ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనిపించడం లేదని - దయచేసి ఆయన్ని వెతికి పెట్టండి అంటూ వైసీపీ నేతలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన కుప్పం వైసీపీ నేతలు.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ తమ ఫిర్యాదులో పొందుపరిచారు. తమ సమస్యలు ఎమ్మెల్యే గారికి విన్నవించుకుందామని వెళితే.. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని , ఎన్నికల ఫలితాల తరువాత ఒకసారి మాత్రమే పర్యటించి.. పార్టీ నాయకులను ఓదార్చిన బాబు తరువాత కనిపించడం లేదని - ఆయన ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలంటూ వారు ఆ ఫిర్యాదులో వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఏపీలో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి - తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన శ్రీదేవీలు కనిపించడం లేదంటూ రైతుల - మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా పోటా పోటీగా బాబు కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

ఇకపోతే చంద్రబాబు కూడా సోమవారం అమరావతిలో పర్యటించారు. మూడు రాజధానుల ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మొత్తంగా ఎమ్మెల్యేలు కనిపించడం లేదు అంటూ ఫిర్యాదులు ఎక్కువైతుండటం తో రాష్ట్రంలో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.