Begin typing your search above and press return to search.

అంతులేని శోకం; చిట్టితల్లి చనిపోయింది

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:09 AM GMT
అంతులేని శోకం; చిట్టితల్లి చనిపోయింది
X
ఎనిమిది రోజుల క్రితం వరకూ చిన్నారి ఆదితి (6) అంటే ఎవరికి తెలీదు. బుజ్జి మాటలతో. . చేష్టలతో టీవీ తెరలపై వచ్చిన ఆదితి.. తెలుగు ప్రాంతాల్లోని ప్రజల ఇంటి పిల్ల అయిపోయింది. ప్రమాదవశాత్తు డ్రైనేజ్ లో పడిపోయిందని భావించి.. ఎనిమిది రోజులుగా కంటి మీద కనుకు లేకుండా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు.. బంధువులకు.. పరిచయస్తులకు.. ప్రజలకు.. తీవ్ర వేదనను మిగులుస్తూ.. విగతజీవిగా కనిపించింది.

సెప్టెంబరు 24న విశాఖపట్నంలో ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతైన ఆదితి మృతదేశం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో లభ్యమైంది. ఒక చిన్నారి మృతదేహాన్ని చూసిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటం.. అనంతరం ఆదితి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం.. వారు చూసిన ఆ పాప తమ ముద్దుల చిన్నారి ఆదితి అని తేల్చటంతో.. ఎనిమిది రోజులుగా ఆదితి కోసం ఎదురుచూస్తున్న వారంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రమాదవశాత్తు పడిపోయిందని భావించినా.. తమ ఆదితి క్షేమంగానే ఉంటుందని భావించిన చిన్నారి తల్లిదండ్రులు తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా మారిపోగా.. చిన్నారి ఒంటి మీదున్న డ్రెస్సు.. చెవి కమ్మల ఆధారంగా మృతదేహం అదితీదేనని తేల్చారు. డ్రైనేజీలో పడిపోయిన చిన్నారి ఏదో విధంగా బతుకుతుందని భావించి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది అదితి బతకాలని ప్రార్థనలు చేశారు.

అయితే.. వారి ప్రార్థనలు ఫలించలేదు. అదితి కోసం జీవీఎంసీ.. పోలీసులు.. నేవీ సిబ్బంది ఎనిమిది రోజులుగా ఎంతగానో గాలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆచూకీ లభించని అదితీ మృతదేహం.. ఆమె పడిపోయిన ప్రాంతం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కనిపించటం గమనార్హం.