Begin typing your search above and press return to search.

జగన్ మాటల్లో కనిపించే ఊపు కేటీఆర్ లో మిస్ అయిందేంటి చెప్మా?

By:  Tupaki Desk   |   16 July 2022 11:30 AM GMT
జగన్ మాటల్లో కనిపించే ఊపు కేటీఆర్ లో మిస్ అయిందేంటి చెప్మా?
X
రెండు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ సిత్రం కనిపిస్తోంది. తెలంగాణలో విపక్షాలు అంత బలంగా లేకపోవటం.. అధికార పార్టీ పవర్ ఫుల్ గా కనిపిస్తుండటం తెలిసిందే. అదే సమయంలో ఏపీలో మాత్రం బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ.. అంతే బలాన్ని విపక్షాలు.. విపక్ష అధినేతలు ప్రదర్శిస్తున్నారు. అంటే.. విపక్షాల కారణంగా అధికారపక్షానికి వచ్చే ఒత్తిడి తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ ఉంటుంది. అలాంటి వేళ.. ఎన్నికల ఫలితాల అంచనాల్ని చెప్పే విషయంలో మరింత ధీమా అవసరం. అందులో ఏ మాత్రం లోటు లేని రీతిలో మాటలు చెబుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఈ మధ్యన జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 150 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్న మాట జగన్ నోటి నుంచి పదే పదే వినిపించింది.నిజానికి ఇలాంటి గెలుపును ఆశించేవారు..ఇలాంటి గెలుపు కోసం టీంను సమాయుత్తం చేసే వారు అరుదుగా కనిపిస్తుంటారు.

నిజానికి బలమైన ప్రజాస్వామ్యం బలమైన విపక్షంతోనే అన్న మాటకు భిన్నంగా జగన్ ఆలోచనలు సాగుతున్నాయని చెప్పక తప్పదు. కనుచూపు మేర విపక్షమే ఉండకూడదన్నది జగన్ ఎజెండా అన్నది తెలిసిందే. ఇలాంటి తీరుకు ఎంతో మనో నిబ్బరం.. మరెంతో కఠిన శ్రమ అవసరం.

అలాంటివి తనలో కొదవ లేదన్న విషయాన్ని తన మాటలతో జగన్ స్పష్టం చేశారని చెప్పాలి. ఇదిలాఉంటే.. తెలంగాణలో మాత్రం సీన్ మరోలా ఉంది. విపక్షాలతో పోలిస్తే బలమైన.. సానుకూలత ఉన్న సర్కారుగా పేరున్న కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాధినేతల్లోనే సందేహాలు ఉన్నాయన్న విషయం తాజాగా వారిమాటల్ని విన్నప్పుడు కలుగక మానదు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 90కు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక్కడ అండర్ లైన్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే.. 2018 ఎన్నికల వేళలో తమకు వంద సీట్లు ఖాయమని గులాబీ బాస్ చెప్పటం.. దానికి దగ్గరగా ఫలితాలు రావటం తెలిసిందే. అలాంటిది తాజాగా మాత్రం గతం కంటే తక్కువ సీట్లు వస్తాయన్న విషయాన్ని మంత్రి కేటీఆరే చెబుతున్నారంటే.. విపక్షాల బలం తెలంగాణలో పెరిగిందన్న విషయాన్ని ఒప్పుకున్నట్లేనని చెప్పాలి.

బలంగా ఉన్న విపక్షాలు విసిరే సవాళ్ల ఒత్తిడితో ఉండి కూడా.. చెదరని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ 150 స్థానాల్లో విజయమన్న జగన్ మాటలతో పోలిస్తే.. వంద నుంచి 90 స్థానాలకు తగ్గిపోయి ఫలితాల మీద అంచనాలు చెబుతున్న మంత్రి కేటీఆర్ టోన్ తేడా కొడుతుందన్న మాట వినిపిస్తోంది. జగన్ మాటల్లో ఊపు.. కేటీఆర్ అంచనాల్లో లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు అసలు ప్రశ్న.