Begin typing your search above and press return to search.

ఎంపీ నుస్రత్ జహాన్ మిస్సింగ్.. పోస్టర్ల కలకలం

By:  Tupaki Desk   |   19 May 2022 8:57 AM GMT
ఎంపీ నుస్రత్ జహాన్ మిస్సింగ్.. పోస్టర్ల కలకలం
X
సినీ నటిగా పాపులర్ అయ్యి.. రాజకీయ అండదండలతో ఎంపీగా గెలిచిన నటి నుస్రత్ జహాన్. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన బసిర్హత్ లోక్ సభ ఎంపీ నుస్రత్ మీద మిస్సింగ్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఆమె కనిపించడం లేదంటూ ఇప్పుడు ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇది రాజకీయంగా కలకలం రేపుతోంది.

పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని చపటాలా, కీయాడంగా ప్రాంతాల్లో నుస్రత్ జహాన్ మిస్సింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లను టీఎంసీ కార్యకర్తలు మాత్రమే అంటించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తృణమూల్ నేతలు ఖండించారు.

బసిర్హత్ నియోజకవర్గానికి ఎంపీ అయిన నుస్రత్ తొలినాళ్లలో వీలు చిక్కినప్పుడల్లా ప్రజలను కలిసేవారు. అయితే ఎంపీగా గెలిచిన కొద్దినెలలకే ఆమె ఒక హిందువును పెళ్లాడింది. అనంతరం విభేదాలతో భర్తకు దూరమైంది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అనంతరం మరో స్నేహితుడికి దగ్గరైంది. ఇలా మలుపులు తిరిగిన ఆమె సంసారంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. వ్యక్తిగత జీవితంలో అనూహ్య మలుపుల కారణంగా నుస్రత్ జహాన్ దాదాపు ఏడాదిన్నరగా సొంత నియోజకవర్గం బసిర్హత్ వెళ్లలేకపోయింది. దీంతో ఎంపీ కనబడుట లేదు అని పోస్టర్లు పెట్టారు ప్రత్యర్థులు.

టీఎంసీలోనే నుస్రత్ వ్యతిరేక వర్గీయులు ఎంపీ మిస్సింగ్ పోస్టర్లను చాలా చోట్ల అంటించారట.. కానీ టీఎంసీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇది ప్రత్యర్థుల పనినే అంటున్నారు.

తమ ఎంపీ నుస్రత్ నియోజకవర్గానికి రాకపోవడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో ఒక వర్గం కూడా ఆగ్రహంతో ఉంది. తృణమూల్ స్థానిక నాయకత్వంలోని ఒక వర్గం ఆమె మెరిసిపోయే తోకచుక్కగా అభివర్ణించింది.

తన సొంత నియోజకవర్గంలో తన పేరు, ఫొటోతో మిస్సింగ్ పోస్టర్లు వెలియడంపై నటి, ఎంపీ నుస్రత్ జహాన్ ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ యువ ఎంపీ కొద్దిరోజుల కింద బికినీలో ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం సృష్టించారు.