Begin typing your search above and press return to search.

మా ఎమ్మెల్యే మిస్సింగ్..ఆయనేమో జర్మనీ నుండే అన్ని..!

By:  Tupaki Desk   |   25 March 2021 7:07 AM GMT
మా ఎమ్మెల్యే మిస్సింగ్..ఆయనేమో జర్మనీ నుండే అన్ని..!
X
తెలంగాణ రాష్ట్ర సమితి నేత - వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా అందుబాటులో లేక ఏడాది అవుతుందంటూ నియోజక వర్గ వాసులు గగ్గోలు పెడుతున్నారు. మా ఎమ్మెల్యే కనిపించక ఏడాది దాటింది , అసలు మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ నిరసనలు కూడా మొదలుపెట్టారు. నియోజక వర్గ ప్రజలు అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు. తనను గెలిపించిన వేములవాడను వదిలి జర్మనీకి వెళ్లిపోయిన చెన్నమనేని కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. దేశంలో కరోనా మొదలైనప్పటి తర్వాత వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ప్రజలకు కనిపించకుండా పోయారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు - మౌలిక వసతుల కల్పన - ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండకుండా విదేశాల్లో ఉండటమేంటని - ప్రతిపక్ష నేతలు - నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయన రాక కోసం అందరూ ఎదురుచూస్తుంటే, అయన మాత్రం జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌లో అందుబాటులోకి వస్తూ వేములవాడ వ్యవహారాలు ఆరా తీస్తూ అన్నీ ఆన్ ‌లైన్ ‌లోనే సరిదిద్దుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు - ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు.

చెన్నమనేని రమేశ్ 2009లో మొదటిసారి వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచే ఆయనపై పౌరసత్వ వివాదం రేగింది. రమేశ్ బాబు భారత చట్టాలని అతిక్రమించి , ద్వంద పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారని, ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రమేశ్ బాబు భారత పౌరుడు కాదని , ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ కూడా కోర్టుకు ఇదే చెప్పింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది. రమేష్ బాబు వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయన ప్రయాణాలన్నీ జర్మన్ పాస్‌ పోర్టుతో చేస్తున్నారంటూ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన కేసు తుది దశకు చేరుకుంది.గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ రచ్చ గురించి కాసేపు పక్కన పెడితే , ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజక వర్గ ప్రజలని కాదని ఏడాదిగా జర్మనీలో ఉండటం ఎంత సమంజసం అంటూ నియోజక వర్గ వాసులు అడుగుతున్నారు.