Begin typing your search above and press return to search.

పెంపుడు పిల్లి మిస్.. వెతికి తెస్తే రూ.30వేలు ఇస్తారట

By:  Tupaki Desk   |   14 July 2021 3:30 AM GMT
పెంపుడు పిల్లి మిస్.. వెతికి తెస్తే రూ.30వేలు ఇస్తారట
X
మీడియాలో పని చేసే వారికి.. అందునా.. రిపోర్టర్లుగా వర్కు చేసే వారికి ప్రెస్ మీట్లను కవర్ చేయటం కొత్తేం కాదు. కాకుంటే రాజకీయ ప్రెస్ మీట్లు ఒకలా.. పోలీసు అధికారుల ప్రెస్ మీట్లు మరోలా.. మరికొన్ని లైఫ్ స్టైల్ కార్యక్రమాలు.. సేవా కార్యక్రమాలు..సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రోగ్రాంల్ని కవర్ చేయటంతో పాటు.. నిరసన.. ఆందోళన కార్యక్రమాలతో పాటు.. తమకు ఎదురవుతున్న సమస్యలపై గుక్క తిప్పుకోకుండా వేదన చెంది.. తమ వెతలు చెప్పే వారి ప్రెస్ మీట్లను కవర్ చేయటం రిపోర్టర్లకు అలవాటే. అలాంటిది మంగళవారం హైదరాబాద్ లోని కొంతమంది రిపోర్టర్లకు భిన్నమైన అనుభవం ఎదురైంది. వారెప్పుడూ కవర్ చేయని సరికొత్త ప్రెస్ మీట్ ను వారు కవర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే?

కని.. పెంచిన వారిని చెట్టుకు.. పుట్టకు వదిలేసే పాడు రోజులు మొదలై చాలానే రోజులు అయ్యాయి. ఈ మధ్యన అలాంటి ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అలాంటిది పెంపుడు జంతువు మిస్ అయితే.. తీవ్రమైన ఎమోషన్ కు గురి కావటమే కాదు.. అంతులేని ఆవేదనతో హైదరాబాద్ కు చెందిన మహిళ ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు పట్ల ఆమెకున్న అభిమానాన్ని.. ప్రేమను అభినందిస్తున్న వారు.. అలాంటి బుద్ది ఇంట్లోని పెద్దవాళ్ల విషయంలోనూ ఉంటే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

టోలీచౌకీకి చెందిన జరీనా అనే మహిళ ఒక పిల్లిని గడిచిన ఎనిమిది నెలలుగా పెంచుకుంటున్నారు. అల్లారు ముద్దుగా సాకుతున్న ఆ పిల్లికి ముద్దుగా జింజర్ అనే పేరును పెట్టుకొని పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జింజర్ కు జూన్ 17న కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించారు. ఇందుకోసం జూబ్లీహిల్స్ లోని ట్రస్టీ పెట్ క్లినిక్ వారి సేవల్ని వినియోగించుకున్నారు. అయితే.. సర్జరీ చేయించిన ప్రదేశంలో వాపు రావటంతో మరోసారి క్లినిక్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్లి కాస్తా మిస్ అయ్యింది. దీంతో.. కంగారు పడిన పిల్లి యజమానురాలు.. రాయదుర్గం పోలీసుల్ని ఆశ్రయించారు. వారు పిల్లి మిస్సింగ్ కంప్లైంట్ ను తీసుకోవటానికి ఇష్టపడలేదు.

దీంతో.. మిస్ అయిన పిల్లి ఫోటోతో కూడిన కరపత్రాల్ని తయారు చేయించి.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పంచారు. గడిచిన 20 రోజులుగా ఆమె విపరీతంగా జింజర్ కోసం వెతుకుతున్నారు. అయినా.. దాని జాడ లభించలేదు. మిస్ అయిన ఆసుపత్రి వారు.. ఎలా మిస్ అయ్యిందంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. విసిగిపోయిన ఆమె.. చివరకు హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కనిపించకుండా పోయిన జింజర్ ను ఎవరైనా వెతికి ఇస్తే రూ.30వేల నజరానా ఇస్తానని ప్రకటించారు. దీంతో.. ఒక్కసారిగా ఈ ఉదంతం మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ ప్రముఖంగా రావటం.. ఇప్పుడీ అంశం వైరల్ గా మారింది. మరి.. ఆమె చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.