Begin typing your search above and press return to search.

బండి చేసిన తప్పు అదేనా? మళ్లీ జైలు మాట రాదా?

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:30 PM GMT
బండి చేసిన తప్పు అదేనా? మళ్లీ జైలు మాట రాదా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అదే పనిగా విరుచుకుపడే అలవాటున్న కొద్ది మంది నేతల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరు. ఘాటు విమర్శ ఏదైనా సరే.. ఒక మోతాదు వరకు బాగానే ఉంటుంది. అంతకు మించితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో బండికి ఆయన పరివారానికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది.

అదే పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి.. .ఆయనపై అవినీతి ఆరోపణలు చేయటం.. జైలుకు పంపుతానని మాటకు చెప్పటమే కానీ.. ఇంతవరకు ఆయన అవినీతి పాలన గురించి ఒక్క మాట అంటే ఒక్క విషయాన్ని రివీల్ చేసింది లేదు.

బండి నోటి నుంచి తరచూ వచ్చే జైలు మాటపై గడిచిన కొద్ది రోజులుగా తీవ్రంగా మండిపడుతున్న కేసీఆర్.. తాజాగా ఒక అడుగు ముందుకు వేసి.. తనను అరెస్టు చేయాలని.. ఆ దమ్ము ఉందా? అంటూ సూటిగా అడిగేయటమే కాదు.. తామే అరెస్టు చేస్తామంటూ ఉల్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కేసీఆర్ అవినీతి మీద పెద్ద పెద్ద ప్రకటనలు చేసే బండి అండ్ కో ఒక్కటంటే ఒక్క విషయాన్ని వెల్లడించకపోవటం ఆయన చేసిన తప్పుల్లో ప్రధానమైనదని చెప్పాలి.

దీంతో ఆయనవి మాటలే తప్పించి చేతలు కావన్నట్లుగా పరిస్థితి ఉంది.దీనికి తోడు.. కేంద్రం నుంచి బండికి అందే సహకారం కూడా పరిమితంగా ఉండటం కూడా ఆయన మాటకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

తాను కేసీఆర్ అవినీతి మీద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో.. ఏదైనా ఒకట్రెండు ఇష్యూలైనా కేసీఆర్ ను ఇరుకున పడే ఉదంతాల్ని బయటపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా మాటల్లోనే తప్పించి చేతల్లో ఎలాంటి యాక్షన్ లేకపోవటంతో.. తాజాగా బీజేపీ పైన కేసీఆరే ఉల్టా విరుచుకుపడ్డారు.

బీజేపీ అవినీతి చిట్టా తన వద్ద ఉందని.. త్వరలోనే బయటపెడతానని చెప్పిన 24 గంటల వ్యవధిలోనే ఆయన రఫెల్ ఇష్యూను తెర మీదకు తీసుకురావటం చూస్తే.. కేసీఆర్ విషయంలో బీజేపీ చేయలేనిది.. బీజేపీ విషయంలో కేసీఆర్ చేస్తున్నదేమిటో ఇట్టే అర్థమైపోతుందని చెప్పాలి.

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటు చాలా కొద్దిమంది మాత్రమే రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు చేయటమే కానీ.. దానికి సంబంధించిన అధికారిక పత్రాలు మాత్రం బయటకు వచ్చింది లేదు.

ఇదే అంశాన్ని ప్రస్తావించటం ద్వారా.. కేసీఆర్ ఒక అడుగు ముందు ఉన్నారని చెప్పాలి. రఫెల్ ఎపిసోడ్ కు సంబంధించి ఆయన ఏదైనా అధికారిక పత్రాల్ని కానీ విడుదల చేశారో.. కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడటం ఖాయం.

రఫేల్ ప్రస్తావన తీసుకొచ్చి.. జైలుకు పంపటం ఖాయమంటున్న కేసీఆర్ మాటల్ని చూస్తే.. రానున్న రోజుల్లో గతంలోమాదిరి బండి సంజయ్ తొందరపడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామన్న మాటను కాస్త ఆచితూచి వాడతారని చెప్పక తప్పదు.