Begin typing your search above and press return to search.

స‌చిన్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్ట‌బోతున్న మిథాలీ.. ప్ర‌పంచ క్రికెట్లోనే స‌రికొత్త చ‌రిత్ర‌!

By:  Tupaki Desk   |   29 Jun 2021 2:30 AM GMT
స‌చిన్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్ట‌బోతున్న మిథాలీ.. ప్ర‌పంచ క్రికెట్లోనే స‌రికొత్త చ‌రిత్ర‌!
X
ఒక మ‌హిళ క్రికెట్ వంటి క్రీడ‌ను ఎంచుకోవ‌డ‌మే గొప్ప‌. సంప్ర‌దాయం వంటి అడ్డంకులు ఎదుర‌య్యే మ‌న‌లాంటి దేశంలో మ‌రీ క‌ష్టం. ఒక‌వేళ క్రికెట్ ను ఎంచుకున్నా.. జాతీయ స్థాయి జ‌ట్టుకు ఎంపిక‌వ‌డం మ‌రీ మ‌రీ క‌ష్టం. ఇవ‌న్నీ దాటుకొని టీమిండియా జెర్సీ వేసుకున్నా.. అది ఒంటిపై ఎంత‌కాలం ఉంటుందో చెప్ప‌డం క‌ష్టం. ఇన్ని గండాల‌ను దాటుకొని కెరీర్ ను కొన‌సాగిస్తూ పోతే..? 5, 10, 15, 20 అంటూ.. ఏళ్లు దాటేస్తూ క్రికెట్ ఆడుతూ పోతే..? అది సాధార‌ణ ఘ‌న‌త‌. ఇంతేకాకుండా.. ఇప్ప‌టి ప్ర‌పంచంలో మ‌గ‌, ఆడ అని తేడా లేకుండా.. ఏ క్రికెట‌ర్ కూడా ఆడ‌న‌న్ని రోజులు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడితే..? అది అసాధార‌ణ రికార్డు మాత్ర‌మే కాదు. మ‌రో పేరేదైనా క‌నిపెట్టాలి.

ఇంత‌టి అద్వితీయ ఘ‌న‌త‌ను సాధించ‌బోతోంది హైద‌రాబాదీ మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌. ఆమె అతి త్వ‌ర‌లోనే ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కాలం క్రికెట్ ఆడిన ప్లేయర్ గా చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ ప్ర‌పంచంలో అత్య‌ధిక కాలం కెరీర్ కొన‌సాగించిన ఆట‌గాడిగా స‌చిన్ టెండూల్క‌ర్ నిలిచాడు. స‌చిన్ 22 సంవ‌త్స‌రాల 91 రోజులు అంత‌ర్జాతీయ క్రికెట్లో కొన‌సాగాడు.

ఆ రికార్డును మ‌రో మూడు నెల‌ల్లో బ్రేక్ చేయ‌బోతోంది మిథాలీ. 1999 జూన్ 26న అంత‌ర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ స్టార్ క్రికెట‌ర్‌.. ఈ నెల 26తో 22 సంవ‌త్స‌రాల కెరీర్ ను పూర్తి చేసుకుంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని భావిస్తోంది. స‌చిన్ మాదిరిగానే త‌న కెరీర్ చివ‌రి వ‌ర‌కు ప్ర‌పంచ క‌ప్ ను గెల‌వ‌లేక‌పోయింది. అదే కోవ‌లో.. స‌చిన్ మాదిరిగానే క‌ప్పు కొట్టి.. గ్రాండ్ గా ఆట‌కు గుడ్ బై చెప్పాల‌ని ఆశిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 214 వ‌న్డేలు ఆడిన మిథాలీ.. మ‌హిళా క్రికెట్లోనే అత్య‌ధిక మ్యాచులు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 7,098 ప‌రుగులు చేసింది. అత్య‌ధిక ప‌రుగులు చేసిన మ‌హిళా క్రికెట‌ర్ కూడా మిథాలీనే. ఇప్పుడు ఏకంగా.. మొత్తం ప్ర‌పంచ క్రికెట్లోనే సుదీర్ఘ కాలం బ్యాట్ ప‌ట్టిన క్రికెట‌ర్ గా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. ఈ ఘ‌న‌త ఖ‌చ్చితంగా మ‌హిళా లోకానికి స్ఫూర్తినిస్తుంద‌ని, ఇవ్వాల‌ని ఆశిద్దాం.