Begin typing your search above and press return to search.

బీజేపీలోకి మెగాస్టార్.. ప్రధాని మోడీ తొలి సభలోనే సంచలనం!

By:  Tupaki Desk   |   7 March 2021 11:40 AM GMT
బీజేపీలోకి మెగాస్టార్.. ప్రధాని మోడీ తొలి సభలోనే సంచలనం!
X
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రధాని మోడీ తన తొలి ప్రచార సభలోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

బాలీవుడ్, బెంగాల్ సినీ రంగాల్లో మెగాస్టార్ గా వెలుగొందుతున్న ప్రముఖ నటుడు, డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి ఆదివారం మోడీ సమక్షంలో బీజేపీలో చేరడం సంచలనమైంది.

మోడీ బెంగాల్ లో నిర్వహించిన తొలి ప్రచార సభలోనే మిథున్ బీజేపీలో చేరారు. మోడీ రావడానికి ముందే రాష్ట్ర బీజేపీ నేతల చేతులమీదుగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు

కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్ మైదానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆ సభా వేదికపైనే మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు.

కాగా, 70 ఏళ్ల మిథున్ చక్రవర్తిని బెంగాల్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. నాలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన శారద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిథున్.. తర్వాతి కాలంలో ఆ సంస్థకు ప్రకటనలు చేసినందుకు లభించిన రూ.1కోటిపైగా మొత్తాన్ని ఈడీకి చెల్లించేశారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మిథున్ చక్రవర్తి.. శారద చిట్ ఫండ్ కుంభకోణం తర్వాత పదవికి రాజీనామా చేశారు. గతంలో నక్సలైట్లతోనూ తనకు సంబంధాలున్నాయని ప్రకటించిన మిథున్.. ఇవాళ బీజేపీ లో చేరడం విశేషంగా మారింది.