Begin typing your search above and press return to search.

అనంత‌లో జ‌గ‌న్ మిత్రుడు మిథున్‌ కు ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   16 Oct 2017 11:16 AM GMT
అనంత‌లో జ‌గ‌న్ మిత్రుడు మిథున్‌ కు ఏం జ‌రిగిందంటే!
X
పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఒక్క‌రొక్క‌రుగా పార్టీని వీడి వెళుతోంటే... ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. విశ్వ‌స‌నీయ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా చెప్పుకుంటున్న ఆయ‌న పార్టీని వీడి వెళుతున్న నేత‌ల‌ను ఆపే య‌త్నాలేమీ చేయ‌డం లేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే ఎంతైనా... తాను ఏర్పాటు చేసిన పార్టీ టికెట్ల‌పై ప్ర‌జా ప్ర‌తినిధులుగా గెలిచిన వారు ఒక్క‌రొక్క‌రుగా వెళుతోంటే... ఒక్క జ‌గ‌న్ కేంటీ... ఎవ‌రికైనా బాధ‌గానే ఉంటుంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గోరు చుట్టపై రోక‌టి పోటు అన్న చందంగా... జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి... పార్టీ అధిష్ఠానంపై దండెత్తారు. ఏకంగా పార్టీ జిల్లా కార్యాల‌యంపైనే ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో దాడి చేయించారు. అది కూడా జ‌గ‌న్‌కు త‌న‌కంటే కూడా మ‌రింత స‌న్నిహితుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమ‌క్షంలో ఈ దాడిని గుర్నాథ్ రెడ్డి చేయించారు.

కాసేప‌టి క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఒక్క అనంత‌పురం జిల్లానే కాకుండా యావ‌త్తు వైసీపీ శ్రేణుల‌నే బెంబేలెత్తిపోయేలా చేసింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన పెద్దిరెడ్ది మిథున్ రెడ్డి అనంత‌పురంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. స్థానిక నేత‌గా ఉన్న గుర్నాథ్ రెడ్డి గానీ - ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం గానీ ఈ స‌మావేశానికి హ హాజ‌రు కాలేదు. గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న గుర్నాథ్... ఆ త‌రహాలోనే ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేద‌ని భావించిన మిథున్ రెడ్డి కార్య‌కర్త‌ల‌తో భేటీలో మునిగిపోయారు. కాస్తంత సేపు స‌వ్యంగానే సాగుతున్న ఈ స‌మావేశంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని మిథున్ రెడ్డి గ‌మ‌నించేలోగానే... గుర్నాథ్ రెడ్డి అనుచ‌రులుగా చెప్పుకున్న కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్యలో స‌మావేశంలోకి చొచ్చుకువ‌చ్చారు. త‌మ నేత‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని - అధిష్ఠానం కూడా అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గొడ‌వ‌కు దిగారు. అంతేకాకుండా ప‌క్క జిల్లా నుంచి వ‌చ్చిన నేత ఇక్క‌డ స‌మావేశం పెట్ట‌డ‌మేంట‌ని కూడా వారు త‌మ‌దైన శైలిలో రాద్ధాంతం చేశారు.

తొలుత షాక్‌ కు గురైన మిథున్ రెడ్డి... ఆ త‌ర్వాత ప‌రిస్థితిని గ‌మ‌నించే య‌త్నం చేసేలోగానే... గుర్నాథ్ రెడ్డికి వ్య‌తిరేకంగా మ‌రో వ‌ర్గం అక్క‌డ బ‌రిలోకి దిగిపోయింది. మిథున్ రెడ్డి స‌మ‌క్షంలోనే ఇరు వ‌ర్గాలు తోపులాట‌కు దిగాయి. కార్యాల‌యంలోని ఫ‌ర్నీచ‌ర్‌ పై ప్ర‌తాపం చూపించాయి. చేతికందిన కుర్చీల‌ను ఇరు వ‌ర్గాల‌ను ఇష్టారాజ్యంగా విర‌గ్గొట్టేశాయి. ప‌రిస్థితి విష‌మిస్తోంద‌ని గ‌మ‌నించిన మిథున్ రెడ్డి అక్క‌డి నుంచి నిష్క్ర‌మించేందుకు సిద్ధం కాగా... ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌న‌ను సుర‌క్షితంగానే బ‌య‌ట‌కు తీసుకురాగా... ఆయ‌న అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. గ‌త కొంత కాలంగా గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ గొడ‌వ జ‌ర‌గ‌డం ఆ ప్ర‌చారానికి మరింత‌గా బ‌లం చేకూర్చిన‌ట్టైంది.