Begin typing your search above and press return to search.

భావోద్వేగానికి గురి చేస్తున్న స్టాలిన్ లేఖ‌

By:  Tupaki Desk   |   8 Aug 2018 6:27 AM GMT
భావోద్వేగానికి గురి చేస్తున్న స్టాలిన్ లేఖ‌
X
గుండెల నిండా క‌మ్ముకున్న విషాదంలో మ‌న‌సులో నుంచి వ‌చ్చే మాట‌ల‌కు ఎవ‌రైనా క‌దిలిపోవాల్సిందే. డీఎంకే శిఖ‌రం క‌లైంజర్ క‌రుణానిధి ఆస్త‌మ‌యంతో త‌మిళులు శోకంతో గుండెలు ప‌గులుతున్నాయి. త‌మిళుల‌కు మిగిలిన ఒకే ఒక్క పెద్దాయ‌న తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోవ‌టంతో త‌మిళ‌నాడు ఇప్పుడు శోక‌త‌ప్త‌మైంది.

పార్టీ విభేదాలు మ‌రిచి మ‌రి.. తామంతా అనాధ‌లైన‌ట్లుగా త‌మిళులు ఫీల‌వుతున్న ప‌రిస్థితి. కోట్లాది మంది పెడుతున్న‌క‌న్నీళ్లు ఓప‌క్క‌.. క‌రుణ రాజ‌కీయ వార‌సుడిగా ఇంత‌కు ముందే డిసైడ్ అయిన స్టాలిన్ శోకం ప‌ట్ట‌రానిదిగా త‌యారైంది. త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయ‌న రాసిన లేఖ ఇప్పుడు అంద‌రిని భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది.

స్వ‌త‌హాగా క‌వి అయిన త‌న తండ్రికి త‌గ్గ‌ట్లే.. స్టాలిన్ మాట‌ల్లో భావోద్వేగం ఉప్పొగించి.. మ‌న‌సుకు అంతులేని విషాదాన్ని క‌మ్మేలా చేస్తోంది. స్టాలిన్ త‌న చేతిరాత‌తో రాసిన ఈ బ‌హిరంగ లేఖ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ.. స్టాలిన్ లేఖ‌లో ఏముంది? అన్న‌ది చూస్తే..

+ ‘‘విరామం లేకుండా పని చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’' ఈ మాట నాకు మీరు 33 ఏళ్ల క్రితం చెప్పారు. మనం చనిపోయినప్పుడు నలుగురూ మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని అన్నారు. మరి తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా అప్పా?

+ నా ప్రియతమ నేత.. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి ‘ఎన్‌ ఉయిరినుం మేలాన అన్బు ఉడన్‌పిరప్పుగళే’ (నా ప్రాణంకన్నా మిన్న అయిన నా తోబుట్టువులారా) అని చెప్పండి తలైవా! ఆ మాట మరో వందేళ్ల వరకు తమిళ జాతిపై, భాషపై మమకారం పెరిగేలా చేస్తుంది.

+ ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి. 80 ఏళ్లుగా మీరు తమిళనాడు కోసం చేసిన సేవలు, సాధించిన రికార్డులు ఇంకెవరైనా సాధించగలరా? అని తెలుసుకోవడానికి ఎక్కడైనా దాక్కుని చూడాలనుకుంటున్నారా?

+ జూన్‌ 3న మీ పుట్టినరోజు. మీకున్న నైపుణ్యాలలో సగం వంతు నాకు ఇవ్వండి అని ఒకసారి మిమ్మల్ని వేడుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ గురువు అన్నాదురై వెళ్లిపోతూ ఆయన హృదయాన్ని మీకు ఇచ్చినట్లే.. మీ హృదయం నాకు ఇస్తారా?

+ ఎందుకంటే మీరు మనసారా సాధించాలని కలలు కన్న పనులు మేం పూర్తిచేస్తాం. ఇంతకాలం మిమ్మల్ని అప్పా అని కాకుండా థలైవరే(మై లీడర్‌) అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా అని పిలవచ్చా థలైవరే.