Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు స్టాలిన్ ఎంత ప్ర‌యారిటీ ఇచ్చారంటే?

By:  Tupaki Desk   |   30 April 2018 5:04 AM GMT
కేసీఆర్‌ కు స్టాలిన్ ఎంత ప్ర‌యారిటీ ఇచ్చారంటే?
X
ఒక్కో నేత‌ది ఒక్కో స్టైల్‌. అలాంటి ద‌శాబ్దాలుగా తాను అనుస‌రిస్తున్న విధానాన్ని ప‌క్క‌న పెట్టేయ‌టం మామూలు విష‌యం కాదు. చెన్నైకి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో స్టాలిన్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆస‌క్తిక‌రంగానే కాదు.. డీఎంకే వ‌ర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. డీఎంకే అధినేత క‌రుణానిధిని ప‌లుక‌రించ‌టానికి వ‌చ్చిన కేసీఆర్ కు క‌రుణ ఇంటి వ‌ద్ద‌ ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. డీఎంకే అభిమానులు పెద్ద ఎత్తున చేరి జ‌య‌జ‌య‌ధ్వానాలు చేశారు. స్టాలిన్ అయితే క‌రుణ ఇంటి బ‌య‌ట నుంచే కేసీఆర్‌ కు స్వాగ‌తం ప‌లికి.. లోప‌ల‌కు తీసుకెళ్లారు.

క‌రుణ‌తో చ‌ర్చ‌ల అనంత‌రం స్టాలిన్ ఇంటికి బ‌య‌లుదేరారు కేసీఆర్‌. ఆ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఉదంతం డీఎంకే వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. అస్వ‌స్థ‌త‌కు గురైన క‌రుణ‌ను ప‌రామ‌ర్శించేందుకు ఇప్ప‌టికే ప‌లువురు జాతీయ నేత‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి పెద్ద మ‌నిషి క‌రుణ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చినప్పుడు సంద‌ర్భంగా ఆయ‌న వాహ‌నంలో ఎక్కుకుండా త‌న వాహ‌నంలోనే మ‌న్మోహ‌న్ సింగ్ వాహ‌న‌శ్రేణిని అనుస‌రించారు స్టాలిన్‌.

ఆ మాట‌కు వ‌స్తే మ‌న్మోహ‌నే కాదు.. ఏ నేత వ‌చ్చినా స్టాలిన్ త‌న కాన్వాయ్ లోనే ప్ర‌యాణిస్తుంటారు. ఫ‌స్ట్ టైం అందుకు భిన్నంగా త‌న కాన్వాయ్‌ ను వ‌దిలేసి.. కేసీఆర్ వాహ‌నంలో వెనుక సీటులో కూర్చోవ‌టం డీఎంకే వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మార‌ట‌మే కాదు.. కేసీఆర్ ప‌ర‌ప‌తి ఎంత‌న్న విష‌యం అక్క‌డి వారంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేసిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ వాహ‌నంలో వెనుక ఎక్కిన స్టాలిన్.. త‌న ఇంటికి విందు భోజ‌నానికి కేసీఆర్ ను స్వ‌యంగా తీసుకెళ్లారు.

స్టాలిన్ ఇంటికి వెళ్లిన కేసీఆర్ బృందానికి ఆయ‌న త‌న‌యుడు ఉద‌య‌నిధి పుష్ప‌గుచ్చం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. త‌న కుటుంబ స‌భ్యుల్ని పేరు పేరునా స్టాలిన్ ప‌రిచ‌యం చేశారు. ఇక‌.. ఉద‌య‌నిధి ద‌గ్గ‌ర ఉండి మ‌రీ కేసీఆర్ అండ్ కోకు స్వ‌యంగా వ‌డ్డించారు.

పంజ‌రం చేప‌.. చికెన్ బిర్యానీ.. మ‌ట‌న్ బిర్యానీతో చ‌క్క‌టి అతిథ్యాన్ని ఇచ్చారు. ఇలా త‌న తొలిరోజు టూర్లో కేసీఆర్ కు చెన్నైలో అపూర్వ‌మైన స్వాగ‌తం ల‌భించింది. ఆయ‌న విష‌యంలో అప‌రిమిత‌మైన గౌర‌వ మ‌ర్యాద‌ల్ని డీఎంకే వ‌ర్గాలు ప్ర‌ద‌ర్శించ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.