Begin typing your search above and press return to search.

అన్నయ్యే పార్టీ అధ్యక్షుడు అంటున్న చెల్లెమ్మ!

By:  Tupaki Desk   |   9 April 2015 5:20 AM GMT
అన్నయ్యే పార్టీ అధ్యక్షుడు అంటున్న చెల్లెమ్మ!
X
రాజకీయాలు అనేవి అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెడతాయి.. అధికార మాయ అన్నా చెల్లెళ్లను కూడా వేరు చేస్తుంది! డీఎంకే ఫస్ట్‌ ఫ్యామిలీలో కూడా ఇదే జరిగింది. పార్టీ అధ్యక్ష పదవులను తండ్రి కరుణానిధి తదనంతరం సొంతం చేసుకోవడానికి స్టాలిన్‌, అళగిరిల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. ఈ పోటీలో కరుణ స్టాలిన్‌కే అండగా నిలవడంతో అళగిరి ఒంటరయ్యాడు. పార్టీ నుంచి బహిష్కరింపబడ్డాడు.

మరి అళగిరిని అలా బయటకు పంపించేసి స్టాలిన్‌ డీఎంకే అధ్యక్ష పదవిని సొంతం చేసుకొంటాడు అనుకొన్నారంతా. ఇంతలో మరో వివాదం. పార్టీ అధ్యక్ష పీఠంపై కరుణ తనయ కనిమొళి కన్నేసిందనే వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న కని పార్టీ పగ్గాలను కోరుకొంటోందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ విషయంలో స్టాలిన్‌, కనిల మధ్య రచ్చ జరుగుతోందని వార్తలు వచ్చాయి.

అయితే అలాందేమీ లేదని అంటోంది కనిమొళి. తనకు పార్టీ పగ్గాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది. అన్నయ్య స్టాలిన్‌కే తన మద్దతు అని ఆమె ప్రకటించింది.

స్టాలిన్‌ నాయకత్వంలో నడవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటనలో పేర్కొంది. స్టాలిన్‌ నాయకత్వంలో డీఎంకే తిరిగి పునరుత్తేజం అవుతుందని కనిమొళి ఆశాభావం వ్యక్తం చేసింది.

అసలు డీఎంకేలో స్టాలిన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు లేరని.. ఆయనంటే పడని వారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని కూడా వ్యాఖ్యానించి కనిమొళి అన్నయ్యపై తన అనురాగాన్ని చాటుకొంది.

మరి కని ఇలా స్టాలిన్‌కు మద్దతు పలకడంతో.. ఇప్పటికే అళగిరి పార్టీ నుంచి బహిష్కరణకు గురవ్వడంతో... డీఎంకేలో నాయకత్వ వివాదానికి తెరపడిందనే చెప్పాలేమో! ఇక కరుణ అధికారికంగా స్టాలిన్‌ నెత్తిన కిరీటం పెట్టడమే తరువాయేమో!