Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు సీఎంగా స్టాలిన్‌?

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:46 PM GMT
త‌మిళ‌నాడు సీఎంగా స్టాలిన్‌?
X
త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మృతిచెందిన త‌ర్వాత రేగిన రాజ‌కీయ సంక్షోభం నేటికీ కొలిక్కి రాలేదు. పైగా రోజుకో మ‌లుపు తిరుగుతూ స‌ర‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌స్తుత సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి - మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు క‌లిసిపోయిన త‌ర్వాత ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. రాష్ట్రంలో పాల‌న స‌జావుగా సాగుతుంద‌ని భావించారు. అయితే, ఆ త‌ర్వాత మ‌రిన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే వెలివేత నేత టీటీవీ దిన‌క‌ర‌న్ ప‌ళ‌ని వ‌ర్గానికి గేలం వేశారు. ఫ‌లితంగా 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దిన‌క‌రన్ గూటికి చేరారు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న డీఎంకే మ‌రో ర‌గ‌డ‌కు దిగుతోంది. ప్ర‌స్తుతం ప‌ళ‌ని ప్ర‌భుత్వానికి 21 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేద‌ని, వారు ఇప్ప‌టికే త‌మ మ‌ద్ద‌తు ఉప సంహ‌రించుకుంటున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్‌ కు లేఖ‌లు కూడా ఇచ్చార‌ని కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ప‌ళ‌ని ప్ర‌భుత్వాన్ని బ‌ల‌నిరూప‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావును కూడా క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవడానికి ఒక్క వారం గడువు ఇస్తున్నామని, అంతలోపు గవర్నర్ స్పందించకపోతే న్యాయ - ప్రజా పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు.

ఇదిలావుంటే, స్టాలిన్ మ‌రోప‌క్క అధికారంలోకి వ‌చ్చేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌ళ‌ని ప్ర‌భుత్వానికి 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉప సంహరించుకున్నారని, ఆయనకు కేవలం 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని స్టాలిన్ చెబుతున్నారు. అధికారంలో ఉండేందుకు కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో త‌మ‌కు సొంతంగా 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, కాంగ్రెస్‌కు ఉన్న 9 మంది, ఒక ముస్లిం లీగ్ ఎమ్మెల్యే కూడా త‌మ‌తో నే ఉన్నార‌ని, అదేవిధంగా దిన‌క‌ర‌న్‌కు మ‌ద్ద‌తిస్తున్న 21 మంది ఎమ్మెల్యేలు కూడా త‌మ‌కే మ‌ద్ద‌తిస్తున్నార‌ని స్టాలిన్ చెబుతున్నారు.

ఈ లెక్క‌ల‌న్నీ చూస్తే.. మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ఉన్నార‌ని, కాబ‌ట్టి తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో త‌ప్పులేద‌నే భావ‌న స్టాలిన్ వ్య‌క్తం చేస్తుండ‌డం ఇప్పుడు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ప‌ళ‌ని ప్ర‌భుత్వ బ‌ల‌ప‌రీక్ష‌కు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మ‌రి స్టాలిన్ డిమాండ్ నెర‌వేరుతుందా? ఆయ‌న ప్లాన్ స‌క్సెస్ అయి.. సీఎం పీఠం ఎక్కుతారా? అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌!!