Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ తో స్టాలిన్‌..చిన్న‌మ్మ‌కు సెల్వం వార్నింగ్‌

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:19 PM GMT
గ‌వ‌ర్న‌ర్‌ తో స్టాలిన్‌..చిన్న‌మ్మ‌కు సెల్వం వార్నింగ్‌
X
తమిళనాడులో మ‌రోరోజు సైతం రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కాయి. ఆ రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావుతో డీఎంకే నేత స్టాలిన్ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో 9 నెలలుగా పాలన స్తంభించిపోయిందని స్టాలిన్ పేర్కొన్నారు. సుస్థిర పాలనకు తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశానని తెలిపారు. శాసనసభను సమావేశపర్చాలని గవర్నర్‌ ను కోరినట్లు చెప్పారు. రాజ్యాంగానికి లోబడి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరానని తెలిపారు. పన్నీరు సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలు సరికాదన్నారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ గవర్నర్ తో భేటీలో తాము పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సత్వరమే ముగింపు పలకాలని ఆయన గవర్నర్ విద్యాసాగరరావును కోరారు. రాష్ట్రంలో అధికారులెవరూ పని చేయడం లేదని పేర్కొన్న స్టాలిన్…రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ కు వివరించారు. కాగా, అలంగనల్లూర్ వద్ద జల్లికట్టు తిలకించేందుకు వచ్చిన స్టాలిన్ అన్నాడీఎంకేలో సంక్షోభంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. జల్లి కట్టు తిలకించేందుకు వచ్చాననీ, డీఎంకే మల్లుకట్టు గురించి మాట్లాడనని అన్నారు.

-మ‌రోవైపు తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మీడియా సమావేశంలో సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అన్నాడీఎంకే పార్టీని చీల్చే కుట్రలను సాగనివ్వమని ప్ర‌క‌టించారు. అంతేకాదు త్వరలో శుభవార్త వింటారని, తానే అధికారం చేపడతానన‌ని ప్ర‌క‌టించారు. అన్నా డీఎంకేను ఎవరూ హైజాక్‌ చేయలేరన్నారు. మద్దతుదారులతో పన్నీర్‌సెల్వం మరోసారి మీడియా ముందుకొచ్చిన సెల్వం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ప్ర‌క‌టించారు.

--అన్నాడీఎంకేలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ను ఆ పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ ప్రథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు శశికళ ప్రకటించిన కొద్ది సేపటికే మధుసూదన్ తనను ఆ పదవి నుంచి ఎవరూ తొలగించలేరని పేర్కొంటూ శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తాను తొలగించానని ప్రకటించారు. అంతే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని, త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.పొయేస్ గార్డెన్ లోని 'అమ్మ' వేద నిలయం ప్రజల ఆస్తి అని చెప్పారు. వేద నిలయంలో తిష్టవేసిన వారిని వెళ్లగొట్టేందుకు 2 రోజుల్లో అక్కడకు వెళ్లనున్నట్టు మధుసూదన్ వెల్లడించారు.

-మ‌రోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు సిద్ధం కావాలని పన్నీర్ సెల్వం వర్గం పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదనీ, త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహిస్తానని ప్రిసీడియం చైర్మన్ గా శశికళ ఉద్వాసన పలికిన మధుసూదన్ అన్నారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ గా తనను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామన్నారు.

- ఇదే స‌మ‌యంలో శశికళకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు తమనెవరూ నిర్బంధించలేదనీ, స్వచ్ఛందంగానే రిసార్ట్స్ లో ఉన్నామని ప్రకటించారు. కాంచీపురంలోని రిసార్ట్స్ లో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. గవర్నర్ నిర్ణయం ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా తన వర్గం ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి భవన్ వద్ద పరేడ్ నిర్వహించాలా అన్న విషయంపై శశికళ తన మద్దతు దారులతో చర్చిస్తున్నారు.

----అన్నా డీఎంకేలో ఏర్పడిన సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమనీ, అందులో తాము జోక్యం చేసుకోబోమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇంత వరకూ అన్నా డీఎంకే నుంచి తమనెవరూ సంప్రదించలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

-మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో గవర్నర్ విద్యాసాగరరావు రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. అన్నాడీఎంకేలో సంక్షోభం, ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. అనంతరం గవర్నర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.