Begin typing your search above and press return to search.

పన్నీర్ సెల్వంకి మరో పరీక్ష!

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:31 AM GMT
పన్నీర్ సెల్వంకి మరో పరీక్ష!
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాట - ముఖ్యంగా అన్నాడీఎంకే లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ట్విస్టులమీద ట్విస్టులిస్తున్నాయి. అమ్మ మరణానంతరం ముఖ్యమంత్రి పీఠంపై పన్నీర్ సెల్వం కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే జయలలిత నెచ్చెలి శశికళ కు అన్నాడీఎంకే పగ్గాలు ఇవ్వడమే కాదు ముఖ్యమంత్రి పీఠం కూడా ఆమెకే ఇవ్వాలని డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్టు చోటుచేసుకుంది. అయితే ఈ ట్విస్ట్ ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే ఇవ్వడం కొసమెరుపు!!

ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులను, అన్నాడీఎంకే ఉన్న వర్గ పోరును సైలంట్ గా గమనిస్తూ ఉన్న డీఎంకే తాజాగా ఒకట్విస్ట్ ఇచ్చింది. అదేమిటంటే... ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్దపడాలని.. ఈ డిమాండ్ మేరకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని! దీంతో ఇప్పటికే శశికళ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ఒక వర్గం బలంగా వినిపిస్తుండగా, ఈ సందర్భంలో పన్నీర్ సెల్వంకి డీఎంకే తాజా డిమాండ్ తో మరో పరీక్ష ఎదురైంది! ఈ సమయంలో పన్నీర్ సెల్వం బలనిరూపణపై దైర్యంగానే ఉన్నారా అనేది పెద్ద ప్రశ్నే!!

కాగా ముఖ్యమంత్రి పీఠం మీద జయలలిత నిచ్చెలి శశికళ ను కూర్చోబెట్టేందుకు అన్నివైపుల నుంచీ రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్‌ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను కూర్చోబెట్టాలన్న డిమాండ్‌ పార్టీలో రోజురోజుకు ఊపందుకుంటోన్న తరుణంలో తాజాగా ఐదుగురు మంత్రులు కూడా ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో డీఎంకే కూడా పన్నీర్ సెల్వాన్ని బలనిరూపణ చేసుకోవాలని కోరడంతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి!

మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు ముమ్మరం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఒకటి రెండు రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/