Begin typing your search above and press return to search.

బాబు ఇలాకాలో నిప్పురాజేస్తున్న త‌మిళ నేత‌

By:  Tupaki Desk   |   19 Jun 2017 6:05 AM GMT
బాబు ఇలాకాలో నిప్పురాజేస్తున్న త‌మిళ నేత‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా - అందులోనూ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త ఆందోళ‌న మొద‌లైంది. పొరుగున ఉన్న త‌మిళ‌నాడు రాష్ర్టానికి చెందిన అధికార - విప‌క్షాలు ఏపీ స‌ర్కారు తీరుపై భ‌గ్గుమంటున్నాయి. కర్ణాటక నుంచి కుప్పం మీదుగా తమిళనాడులో ప్రవహించే పాలారు నదిపై చెక్ డ్యాంలు నిర్మించేందుకు ఏపీ సర్కారు ముందుకు క‌ద‌ల‌డ‌మే ఇందుకు కార‌ణం. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో చెక్‌ డ్యామ్‌ ల నిర్మాణాలను వెంటనే నిలిపేయాలంటూ ముఖ్యమత్రి పళణిస్వామి ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మూడ్రోజుల క్రితం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సైతం ఎంట్రీ ఇచ్చింది. డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కుప్పంలో క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న చేశారు.

ఎస్‌ ఆర్‌ పురం సమీపంలోని నెలవాయి వద్ద చేపడుతున్న డ్యామ్‌ తో పాటు కుప్పం మండలం పెద్దవంక సమీపంలోని కనకనాచమ్మ ఆలయం వద్ద నిర్మించిన చెక్‌ డ్యామ్‌ ను తమిళనాడు ప్రతిపక్షనేత స్టాలిన్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ తమిళ ప్రజలకూ హక్కుందని, ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చెక్‌ డ్యామ్‌ లు నిర్మించడం సబబుకాదని స్టాలిన్‌ అన్నారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలకూ ఉందని స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలారు విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై మొదటినుంచీ తమిళ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారని తెలిపారు. పాలారు నదిపై చేపట్టే నిర్మాణాలకు ఎలాంటి అనుమతులూ లేవని, అయిన‌ప్ప‌టికీ ఏపీ స‌ర్కారు దూకుడుగా ముందుకు పోతోంద‌ని స్టాలిన్ ఆరోపించారు.

తమిళ రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదని స్టాలిన్ తెలిపారు. ఇలాంటి ప‌రిణామాలు రెండు రాష్ర్టాల మ‌ధ్య సంబంధాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే కాకుండా ఆందోళ‌న‌ల‌కు సైతం దారితీసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో నీటి ప్రాజెక్టులు - చెక్‌ డ్యామ్‌ ల నిర్మాణాలకు సంబంధించి ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడతానని స్టాలిన్ ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/