Begin typing your search above and press return to search.

చట్టం కాకుండానే దిశ పీఎస్:జగన్ ప్రారంభించిన పీఎస్‌ లో మహిళా ఎమ్మెల్యేకు ఝలక్

By:  Tupaki Desk   |   10 Feb 2020 4:21 PM GMT
చట్టం కాకుండానే దిశ పీఎస్:జగన్ ప్రారంభించిన పీఎస్‌ లో మహిళా ఎమ్మెల్యేకు ఝలక్
X
ఏపీ సీఎం జగన్ శనివారం దిశ పోలీస్ స్టేషన్ - దిశ యాప్‌ ను ప్రారంభించారు. మహిళలు - బాలికలపై దారుణం జరిగితే, వారి మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా పద్నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా దిశ చట్టం 2019ని రూపొందించారు. అలాగే దిశ పీఎస్ - యాప్‌ ను రెండ్రోజుల క్రితం ప్రారంభించారు. ఐతే ఈ పీఎస్‌లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విషయం ఏమంటే పోలీసులు కేసు తీసుకోవడం లేదట. అందుకు కూడా ఓ కారణం ఉంది. ఈ విషయం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో వెలుగు చూసింది.

ఇటీవల మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చెబుతూ భవానీ రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్‌ కు వెళ్లారు. ఆమె పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దిశ కేసును నమోదు చేయలేదు. స్టేషన్ ప్రారంభమై మూడ్రోజులైనా దిశ కేసు నమోదు చేసుకోకపోవడంపై ఆమె ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆమె మీడియా ముఖంగా చెప్పారు.

సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సభాపతికి ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. దీంతో దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని - కానీ కేంద్రం ఇంకా చట్టాన్ని ఆమోదించనందున ప్రస్తుతం దిశ కేసును నమోదు చేయలేమని పోలీసులు చెప్పారన్నారు.

చట్టాలు పూర్తి కాకుండానే మహిళలను మభ్యపెట్టేలా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఏమిటని ఆదిరెడ్డి భవానీ నిలదీశారు. మహిళలకు రక్షణ ఇచ్చేందుకే ఈ పోలీస్ స్టేషన్లు అంటూ సీఎం అబద్దపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఇలా అయితే దిశ స్టేషన్‌ లో సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

దిశ చట్టం అమలులోకి రావాలంటే రాష్ట్రపతి ఆమోదముద్ర పడాలి. ఐతే దిశ బిల్లులో ఐపీసీ - సీఆర్బీసీకి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రం చేయలేదు. అందువల్లే ఆలస్యమైందని చెబుతున్నారు. అది పూర్తి కాకుండానే సీఎం దిశ పోలీస్ స్టేషన్‌ ను ప్రారంభించారు.