Begin typing your search above and press return to search.

క్రిమిన‌ల్ కేసుందా..అసెంబ్లీలో జాబ్ దొరుకుతుంది

By:  Tupaki Desk   |   19 April 2017 1:29 PM GMT
క్రిమిన‌ల్ కేసుందా..అసెంబ్లీలో జాబ్ దొరుకుతుంది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాస‌న‌స‌భా నిర్వ‌హ‌ణ తీరు తీవ్ర వివాదాస్ప‌దంగా మారింద‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే మండిప‌డ్డారు. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ రూల్స్ ప్రకారం నడుచుకోకుండా పచ్చచొక్కాలు వేసుకొని తెలుగుదేశం కార్యకర్తలా పనిచేస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. అసెంబ్లీ సెక్రటరీ మీద బంజారాహిల్స్ లో క్రిమినల్ కేసు నమోదై నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి మీద కేసు నడుస్తున్న సమయంలో తక్షణం ఆయన్ను తప్పించి విచారణ నుంచి క్లియరై బయటకొచ్చాకే తీసుకోవాలని సీసీఏ రూల్స్ చెబుతున్నాయని ఆర్కే తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీపై అభియోగాలున్నా కూడ ఆయనపై చర్యలు తీసుకోకుండా.....అలాంటి ఉద్యోగి అయితేనే తమకు పనికొస్తాడని బాబు - స్పీకర్ లు తమ తొత్తుగా పెట్టుకోవడం బాధాకరమని ఆర్కే వ్యాఖ్యానించారు. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల స‌భా విశ్వ‌స‌నీయ‌త‌పై సందేహం వ్య‌క్త‌మ‌వుతుంద‌ని అన్నారు.

అసెంబ్లీ సెక్రటరీ ఇంటర్ మాత్రమే చదివారిని, కనీసం డిగ్రీ కూడా లేదని ఆర్కే అన్నారు. అసెంబ్లీ కార్య‌ద‌ర్శిగా చేయాలంటే కచ్చితంగా లా డిగ్రీ ఉండాలని రూల్స్ చెబుతున్నా... చంద్రబాబు - గవర్నర్ - స్పీకర్ - చీఫ్ సెక్రటరీలు చర్యలు తీసుకోకుండా ఆయన్ను ఎందుకు పరిరక్షిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం గానీ, అధికారులు గానీ దానిపై స్పందించకపోవడం చూస్తుంటే ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నారో అర్థమవుతోందని ఆర్కే మండిప‌డ్డారు. సమాచార హక్కు చట్టం కింద 45రోజుల లోపల కోరిన సమాచారం అందించాలని స్పష్టంగా చెబుతున్నా కూడ రెండేళ్ల కాలంగా ఇవ్వలేదంటే వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. హైకోర్టులో తాను వేసిన కేసుల ద్వారా బలవంతంగా పంపించే పరిస్థితిని తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐఏఎస్ - ఐపీఎస్ మీటింగ్ లలో మా పార్టీ వాళ్లకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చిన సీఎం చంద్ర‌బాబు - అధికారులకు కూడ సహకరించాలని ఆర్డర్ ఇచ్చాడేమోనని ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ నామినేషన్ సమయం దగ్గర పడుతుందని చెప్పి బాబు మెప్పు పొందడం కోసం గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే అసెంబ్లీ కార్య‌ద‌ర్శి ఏకంగా మధ్యలో లేచి బయటకు వెళ్లిపోవడం బాధాకరమని ఆర్‌కే అన్నారు. బాధ్య‌త‌ - అర్హత లేని వ్యక్తిని కొనసాగించవద్దని గవర్నర్ ను కోరారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నర్ దేనని ఆర్కే చెప్పారు. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆర్కే అన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ ద్వారా నోటీసులిచ్చి స్పీకర్ ను కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/