Begin typing your search above and press return to search.

అంబటికి పొగ పెడుతున్న ఆళ్ళ... స్కెచ్ ఎవరిది...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 2:30 PM GMT
అంబటికి పొగ పెడుతున్న ఆళ్ళ... స్కెచ్ ఎవరిది...?
X
గుంటూరు జిల్లాలో నోరున్న పేరున్న మంత్రి గారి సీటుకే ఎసరు తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. వైఎస్సార్ ఫ్యామిలీకి వీరవిధేయుడిగా ఉన్న అంబటి రాంబాబు అపుడేపుడో 1989లో గెలిచిన తరువాత మళ్ళీ గెలుపు ముఖం చూసింది 2019 ఎన్నికల్లొనే. ఆయన మూడు దశాబ్దాల తరువాత గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుని ఓడించి మరీ అసెంబ్లీ ప్రవేశం చేశారు.

ఇక అంబటి 2014 ఎన్నికల్లో కోడెల మీద కేవలం 924 ఓట్ల తేడాతో ఓడారు. అయిదేళ్ళు గడిచేసరికి ఆయన అదే కోడెల మీద 20,876 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. సత్తెనపల్లి సీటు నుంచి మరోసారి పోటీ చేయాలని మంత్రిగా కూడా ఉన్న అంబటి భావిస్తున్నారు. ఇక కోడెల మరణించడంతో పాటు తెలుగుదేశంలో వర్గపోరు కూడా తనకు కలసివస్తుందని, పైగా మంత్రిగా ఉన్నందున అన్ని రకాలుగా తనకు అనుకూలిస్తుందని కూడా లెక్కలేస్తున్నారు.

అయితే అంబటి రాంబాబు ఆశలు ఈసారి అడియాశలు అవుతాయా. ఆయనకు తానున్న పార్టీలోనే టికెట్ కోసం పోరు తప్పదా అంటే పరిస్థితులు చూస్తే అవును అనే అంటున్నారు. సత్తెనపల్లి సీటు మీద మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి కన్ను వేశారని టాక్ నడుస్తోంది. ఆయన రెండు సార్లు గెలిచిన మంగళగిరిలో వ్యతిరేకత ఉందని ఆయనకూ తెలుసు. దాంతో టికెట్ తెచ్చుకున్నా గెలిచేది లేదని ఆయన డిసైడ్ అయ్యారట.

ఇక మంగళగిరిలో ఇటీవల జరిగిన కీలక పరిణామం ఏంటి అంటే టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న గంజి చిరంజీవి వైసీపీ కండువా కప్పుకున్నారు. చేనేత సామాజికవర్గం అక్కడ అధికంగా ఉంది. దాంతో బీసీ కార్డుతో మరోసారి అక్కడ గెలవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.దాంతో ఆర్కేకు టికెట్ దక్కదని అంటున్నారు. ఈ విషయం ముందుగా గ్రహించిన ఆళ్ళ సేఫ్ సీటు కోసం చూసుకుంటూ సత్తెనపల్లిలో మెల్లిగా ల్యాండ్ అయ్యారుట.

అక్కడ ఆయనకు మునుపటి నుంచి కూడా పట్టుంది అంటున్నారు. ఆయన బంధువులు, స్నేహితులు కూడా సత్తెనపల్లిలో ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే 2009 ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి ఆళ్ళ ట్రై చేశారట. అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రం వెంకటేశ్వరరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దాంతో 2014లో మంగళగిరి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఆళ్ళ ఎమ్మెల్యే కాగలిగారు.

ఇపుడు ఆయన చూపు సత్తెనపల్లి మీద ఉంది అంటున్నారు. జగన్ సైతం ఆళ్ళకు అకామిడేట్ చేయడానికి రెడీ అంటున్నారు. దాంతో ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి అంబటికి సీటు సమస్య వచ్చిపడింది అని అంటున్నారు. ఆయనను ఏకంగా జిల్లా దాటించేసి క్రిష్ణా జిల్లా అవనిగడ్డకు పంపుతారు అని తెలుస్తోంది. అక్కడ ఆయన సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారుట. దాంతో పాటు విద్యార్ధి దశ అంతా అంబటిది అక్కడే గడచింది. ఆయనకు అక్కడ పరిచయాలు బాగా ఉన్నాయని చెప్పి అవనిగడ్డకు పంపాలని చూస్తున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.