Begin typing your search above and press return to search.

జనసేన టార్గెట్ : బంతీ... చామంతీ.. ఎర్ర కొండలు...ఇంతకీ ఎవరాయన...?

By:  Tupaki Desk   |   5 Jun 2022 1:30 AM GMT
జనసేన టార్గెట్ : బంతీ... చామంతీ.. ఎర్ర కొండలు...ఇంతకీ ఎవరాయన...?
X
ఆయన రాజకీయ అరంగేట్రమే చిత్రంగా జరిగింది. తన వ్యాపారాలూ తాను ఏమిటో అన్నట్లుగా గమ్మున ఉండే ఆయనను తెచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఓవర్ నైట్ ఎమ్మెల్యే చేశారు ఆయన గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అది లగాయితు రాజకీయ అదృష్టవంతుడిగా గురువు బాటలోనే ఓటమి లేని వీరుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఆయన చిరంజీవి పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన మెగా ఫ్యామిలీకి రుణపడి ఉండాల్సిందే. ఇదొక పొలిటికల్ ఫిలాసఫీ.

కానీ రాజకీయాల్లో రుణాలు కరుణలు అసలు ఉండవు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూసుకెళ్ళిపోవాల్సిందే. ఇదే రాజనీతి, ఇదే రాజకీయ నీతి కూడా. దాన్ని పూర్తిగా ఫాలో అవుతున్న అవంతి ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ అటు నుంచి టీడీపీ ఆ మీదట వైసీపీ లోకి వచ్చి మంత్రి కూడా అయ్యారు. ఇపుడు ఆయన అక్కడ బాగాలేకపోతే తిరిగి చూసే చూపు టీడీపీయే కానీ మరో పార్టీ కాదు.

సరిగ్గా అలాంటి విషయాలు ఏవో జనసేన అధినాయకత్వానికి మండిస్తున్నట్లుగా ఉన్నాయి కాబోలు. అందుకే ఆయన్ని తరచూ టార్గెట్ చేస్తున్నారు ఆ పార్టీ వారు. రీసెంట్ గా అంటే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అవంతిని పట్టుకుని బంతీ పూబంతీ చామంతీ అంటూ విమర్శలు చేశారు. దానికి హర్ట్ అయిన అవంతి ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

ఇపుడు ఆయన అన్న గారు నాగబాబు అవంతి కేరాఫ్ ఎర్ర కొండలు అని కొత్త బిరుదు తగిలించారు. ఇంతకీ ఆ ముచ్చట ఏంటి అంటే అవంతి భీమిలీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ ఎర్రమన్ను దిబ్బలు అనబడే కొండలను ఆసాంతం మింగేశారు అని. ఇలా నాగబాబు గట్టిగానే అవంతిని టార్గెట్ చేశారు. మరి దీనికి అవంతి వారి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి.

ఏది ఏమైనా తమ అన్న వల్ల రాజకీయ జన్మ ఎత్తిన అవంతి అదే కుటుంబం నుంచి వచ్చిన మరో పార్టీ జనసేనకు హెల్ప్ గా అండగా నిలబడకుండా సొంత ప్రయోజనాలు చూసుకున్నారు అన్న బాధ ఆవేదన ఆ పార్టీ పెద్దలకు ఉన్నట్లుంది. అందుకే అవంతిని టీడీపీ లో ఉన్నప్పటి నుంచి కూడా పవన్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

ఇపుడు వైసీపీ అంటే పూర్తిగా మండే పవన్ అవంతికి ఒక లెక్కన చెడుగుడు ఆడుతున్నారు. మరి అవంతి కి ఈ విషయాలు అర్ధమవుతున్నాయా లేక అర్ధం కానట్లుగా ఎప్పటిమాదిరిగానే తనదైన విమర్శలు చేస్తూ పోతారా. సరే ఇంతకీ నాగబాబు ఎర్రకొండలను అవంతి మింగేశారు అని చాలా ఘాటైన ఆరోపణ చేశారు. దానికి మాజీ మంత్రి గారి సమాధానం ఏంటో మరి.