Begin typing your search above and press return to search.

లేఖ రాస్తేనే హ‌క్కుల ఉల్లంఘ‌నేంటి బాబు?

By:  Tupaki Desk   |   3 Sep 2015 12:43 PM GMT
లేఖ రాస్తేనే హ‌క్కుల ఉల్లంఘ‌నేంటి బాబు?
X
అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక‌.. భావోద్వేగ అంశాల మీద అయితే మ‌రింత జాగ‌రూక‌త అవ‌స‌రం. అధికారం అన్న‌ది శాశ్వితం కాద‌ని.. ప‌వ‌ర్ ఉన్న రోజు.. లేని రోజు అంటూ ఉంటుంద‌న్న విష‌యాన్ని రాజ‌కీయ పార్టీ నేత‌లు మ‌ర్చిపోకూడ‌దు. అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణ‌యాల‌కు ఆ త‌ర్వాత రోజుల్లో స‌మాధానం చెప్పాల్సి రావ‌ట‌మే కాదు.. తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తొమ్మిదిన్న‌రేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు.. వ్య‌వ‌సాయం దండ‌గ అంటూ చేసిన వ్యాఖ్య‌.. విప‌క్షంలో ఉన్న‌ చంద్ర బాబును ప‌దేళ్ల పాటు వెంటాడింద‌న్న మ‌ర్చిపోకూడ‌దు. అందుకే.. చేసే వ్యాఖ్య‌ల నుంచి.. తీసుకునే నిర్ణ‌యాల వ‌ర‌కూ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేసిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ ఫోటోను తీసి వేసిన ఉదంతంలో.. కాంగ్రెస్ ఎంపీ.. వైఎస్ కు అత్యంత సన్నిహిత మిత్రుడైన కేవీపీ రామ‌చంద్ర‌రావు.. ఏపీ స్పీక‌ర్ కు ఓ లేఖ రాశారు. వైఎస్ ఫోటోను తీసివేయ‌టంపై ఆయ‌న త‌న లేఖ‌లో కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. తీసేసిన వైఎస్ ఫోటోను వెంట‌నే లాంజ్ లో ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ లేఖ.. ఏపీ స్పీక‌ర్ కు దురుద్దేశాలు అపాదించేలా ఉంద‌ని.. అందుకే ఆయ‌న‌పై స‌భాహ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోపిస్తూ. ఆయ‌న‌కు నోటీసులు ఇస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌క‌టించ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే అంశంపై మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ.. ఈ లేఖ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని.. స్పీక‌ర్ దీనిపై విచార‌ణ‌కు ఆదేశించొచ్చ‌ని.. అవ‌స‌ర‌మైన జైలుకు కూడా పంపొచ్చని వ్యాఖ్యానించారు. ఒక అంశానికి సంబంధించి ఒక నేత రాసిన లేక స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని తేల్చ‌టం.. దానిపై చ‌ర్య‌ల‌కు సైతం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌టం లాంటివి దూకుడుగా కాకుండా.. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.